మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్లు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ కు చేరుకున్నాయి. నేడు జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ ల్లో కర్ణాటకపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో ; అస్సాం పై మహారాష్ట్ర 12పరుగులతో విజయం సాధించి టైటిల్ పోరులో నిలిచాయి.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం ఏ గ్రౌండ్స్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో సౌరాష్ట్ర టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కర్ణాటకలో ఓపెనర్ సమర్థ్ ఒక్కడే 88 పరుగులతో రాణించాడు. మనోజ్ భందగే 22 స్కోరు చేశాడు. 49.1 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌరాష్ట్ర కెప్టెన్ ఉనాద్కత్ నాలుగు వికెట్లతో రాణించాడు. ప్రేరక్ మండక్ రెండు; కె. పటేల్, పార్ధ్ భట్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో పరుగుల ఖాతా తెరవకముందే సౌరాష్ట్ర ఓపెనర్లు ఇద్దరు ఔటయ్యారు. ఆ తర్వాత జయ్ గోహిల్-61; ప్రేరక్ మండక్-35; సమర్థ్ వ్యాస్-33 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ నిలబెట్టారు. 36.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి విజయం సాధించింది. జయదేవ్ ఉనాద్కత్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం బి గ్రౌండ్స్ లో జరిగిన రెండో సెమీ ఫైనల్లో అస్సాం పై మహారాష్ట్ర 12 పరుగులతో విజయం సాధించింది. 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అస్సాం పోరాడి ఓటమి పాలైంది. టాస్ గెలిచిన అసోం బౌలింగ్ ఎంచుకుంది. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి సత్తా చాటి 126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 168 పరుగులు చేయగా… బావ్నే 89 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 110 పరుగులు చేసి జట్టు భారీ స్కోరులో తనవంతు పాత్ర పోషించాడు. ఎస్ ఎస్ బచ్చావ్ కూడా 41 పరుగులు చేశాడు. నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్- బావ్నేలు మూడో వికెట్ కు 207 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. అస్సాం బౌలర్లలో ముఖ్తార్ హుస్సేన్ మూడు వికెట్లు తీశాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగినఅస్సాం జట్టులో స్వరూపం-95; సిబంకర్ రాయ్-78; రిషవ్ దాస్ -53 పరుగులతో రాణించారు. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేయగలిగింది. రాజ్ వర్ధన్ నాలుగు; మనోజ్ ఇంగాలే రెండు; సత్యజీత్ బచ్చవ్, కాజి చెరో వికెట్ పడగొట్టారు.
రుతురాజ్ గైక్వాడ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.