Cape Town Test: మూడో టెస్టులో సౌతాఫ్రికా గెలుపు బాటలో పయనిస్తోంది. ఇండియా విసిరిన 212 పరుగుల విజయ లక్ష్యంలో మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 111 పరుగులు కావాల్సిఉంది.
అంతకుముందు రెండు వికెట్లకు 52 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ఇండియా ప్రారంభించింది. సౌతాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సేన్, రబడ, నిగిడి రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. మరోసారి టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. పంత్ మినహా మిగిలిన వారిలో కెప్టెన్ కోహ్లీ 29; రాహుల్-10 మాత్రమే రెండకెల స్కోరు చేయగలిగారు. జాన్ సేన్ నాలుగు; రాబడ, నిగిడి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. విజయం కోసం 212 పరుగులు చేయాల్సిన సౌతాఫ్రికా జట్టు స్కోరు 23 వద్ద ఓపెనర్ ఏడెన్ మార్ క్రమ్ (16) ను షమి అవుట్ చేశాడు. నేటి మ్యాచ్ కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్ ఎల్గర్ (30) బుమ్రా బౌలింగ్ లో పంత్ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. కీగాన్ పీటర్సన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.