Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందీ రుద్దుడు ఏంది?

హిందీ రుద్దుడు ఏంది?

Only Official: దేశంలో ఎన్నో అంశాలు ఎప్పట్నుంచో చర్చకు రావల్సి ఉన్నా రాకపోవడం,  కొన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నా  విస్తృతంగా  జరగక పోవడం మనం చూస్తూనే ఉన్నాం.  ఈ కోవలోనిదే జాతీయ భాష అంశం.. చాలామంది ఇప్పటికీ హిందీ మన జాతీయ భాష అని పొరబడుతుంటారు.

ఓ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ముంబై హైకోర్ట్ న్యాయమూర్తి హిందీని జాతీయభాషగా పేర్కొనడంపై తెలంగాణాకు చెందిన ఓ వ్యక్తి అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 345 ప్రకారం దేశంలో అధికారిక భాషలే తప్ప జాతీయ భాషలేవీ లేవన్న వాదనను వినిపిండడంతో ఇప్పుడు హిందీ భాష భాష మీద మరోసారి  చర్చ మొదలయ్యింది. ముంబై హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు పిటిషనర్ సుప్రీం మెట్లెక్కాడన్నది ఓ విశేషమైన వార్త!

భారతదేశానికి ఒక జాతీయ భాష అవసరమా?
రాజ్యాంగం ప్రకారం అసలు భారతదేశానికి జాతీయభాషే లేదు. వాస్తవానికి అప్పటి అఖండ భారతావనిలో ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ ఈ మూడూ అధికారిక భాషలుగా చలామణి అయ్యాయి. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు కూడా 15 ఏళ్ల వరకు మాత్రమే ఇంగ్లీష్ ను కొనసాగించాలని అప్పటి పాలకులు భావించారు. అయితే ఆ తర్వాత కూడా ఇంగ్లీషును కొనసాగించడానికి వీలు కల్పించే అధికారాన్ని భారత పార్లమెంటుకు చట్టం కల్పించింది.

1964 సమయంలో దేశంలో హిందీని అధికార భాషగా గుర్తించాలనే విషయం చర్చకు వచ్చినప్పుడు హిందీయేతర భాషలు మాట్లాడే తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది బెల్ట్‌ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో  తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కానీ, నాటి పాలకుల గట్టి పట్టుదలే కారణమో, అధికంగా హిందీ మాట్లాడే వారే ఎక్కువ ఉన్నారని ఉత్తరాదిని మాత్రమే దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలోగానీ.. నాటి నుంచి హిందీ, ఇంగ్లీష్ ఈ రెండూ దేశంలో అధికారిక భాషలుగా చలామణిలోకి వచ్చేశాయి.

మొదట చెప్పుకున్నట్టుగా ఆర్టికల్ 345 ప్రకారం జాతీయభాషలేవీ లేకపోగా, ఆర్టికల్ 343 ప్రకారం హిందీ, ఇంగ్లీష్ ఈ రెండూ అధికార భాషలుగా గుర్తింపులోకి వచ్చేశాయి. అదే దేవనాగరి లిపిలో ఇవాళ మనం రాసుకుంటున్న హిందీ నాటి యూనియన్ ఆఫ్ ఇండియా అధికారిక భాష.

యూనియన్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రయోజనాలు, చట్టసభల్లో మాట్లాడ్డం, ఇతర వ్యాపార లావాదేవీలు, కేంద్ర, రాష్ట్ర చట్టాలు, కోర్టుల్లో కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించబడే భాషలుగా వాడటానికి హిందీ, ఇంగ్లీష్ ను కేవలం అధికారిక భాషలుగా మాత్రమే గుర్తించారు.

భారత్ లో ప్రజలెక్కువగా మాట్లాడే భాషలుగా షెడ్యూల్ 8 ప్రకారం… అందులో 22 షెడ్యూల్ భాషలను గుర్తించారు. అందులో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి, డోగ్రీ వంటి భాషలున్నాయి. వీటిలో 14 భాషలు మొదట భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. 1967లో సింధీ భాషకూ ఆ గుర్తింపు దక్కింది. ఆ తర్వాత మరో మూడు భాషలైన కొంకణి, మణిపురీ, నేపాలీ వంటివి 1992లో చేర్చారు. ఆ తర్వాత బోడో, డోగ్రీ, మైథిలీ, సంతాలి వంటివాటికి 2004లో గుర్తింపు దక్కింది. అయితే ఇప్పుడు తాజాగా అంగిక, బంజారా, భోజ్ పురి, ఛత్తీస్ గరీ, గుజ్జరీ, కర్బీ, గోండీ వంటి మరో 38 భాషలను కూడా షెడ్యూల్ భాషలుగా గుర్చించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

భాషలు, ఆయా భాషల మాండలికాలతోనే చైతన్యవంతమైన సమాజ ఏర్పాటుకు సాధ్యపడే క్రమంలో  భాషలనుంచి మాండలీకాలను కూడా వేరుచేసి కొత్త గుర్తింపునివ్వడమన్నది ఒకింత గందరగోళానికి దారితీసే అవకాశముందన్న వాదనలూ వినిపించాయి. 1996లో ఏర్పాటైన పహ్వా కమిటీ ఆతర్వాత 2003లో ఏర్పాటైన సీతాకాంత్ మహాపాత్ర కమిటీ ఆ ప్రయత్నాలు చేయాలని చూసినా అవి సఫలీకృం కాలేదు. అయితే ఆయా ప్రాంతాల మాండలికాలకు ప్రత్యేక భాషలుగా గుర్తింపునివ్వాలని… ఎనిమిదవ షెడ్యూల్ లో చేర్చాలన్న డిమాండ్స్ ను.. ఆయా ప్రాంతాల సెంటిమెంట్స్, అక్కడి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ వెల్లువెత్తే అభ్యర్థనలన్నీ ఈ వ్యవహారాలను చూసే కేంద్రం హోంమంత్రిత్వశాఖ పరిశీలిస్తూనే ఉంది.

అయితే భాషల  మనుగడ వెనుక ఇంత కథ ఉన్న నేపథ్యంలో ముంబై హైకోర్ట్ న్యాయమూర్తి  హిందీని జాతీయభాషగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ… హిందీ జాతీయభాష కాదు… కేవలం అధికారిక భాష మాత్రమేనంటూ ఏకంగా మన తెలంగాణాకు చెందిన పిటిషనరే సుప్రీం మెట్లెక్కడం.. భాషలు, దాని ప్రస్థానం గురించి ఇంతగా చెప్పుకునేందుకు ఆస్కారాన్ని కల్పించింది.

(పాత వ్యాసం… హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో పునశ్చరణ)

-రమణ కొంటికర్ల

Also Read :

ఏది చర్చ? ఏది రచ్చ?

Also Read :

ఇకపై తమిళ అక్షరంలోనే సంతకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్