Sunday, September 8, 2024
Homeసినిమామాట పరిమళం .. పాట పరవశం

మాట పరిమళం .. పాట పరవశం

( జూన్ 4, ఎస్పీ బాలు జయంతి – ప్రత్యేక వ్యాసం)

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం .. తెలుగు పాటకు తేనె బాట వేసిన పేరు. దశాబ్దాలపాటు శ్రోతల గుండె గుమ్మాల ముందుగా గలగలమంటూ ప్రవహించిన సెలయేరు. ఆయన స్వరాన్ని స్పర్శించడానికి అక్షరాలు ఆరాటపడతాయి .. పదాలు పందాలు కడతాయి. ఆయన స్వరాన్ని దాటుకుని వచ్చిన ప్రతిపాట అమృతమై ప్రవహిస్తుంది. నరాలకు నాట్యం నేర్పుతూ అమాంతంగా ప్రవేశిస్తుంది. మధురమైన ఆ పాటలు మనసుపై మంత్రంలా పనిచేస్తాయి .. మురిపిస్తూ లాలిస్తాయి .. ముచ్చటగా పరిపాలిస్తాయి.

తెలుగునాట .. తెలుగు పాట ఆయనకి ముద్దుగా పెట్టుకున్న పేరు ‘బాలు’. 1946 జూన్ 4వ తేదీన ఆయన నెల్లూరు జిల్లా ‘కోనేటమ్మపేట’లో జన్మించారు. తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు. ఆయనకి తెలుగు సాహిత్యంపై .. భాషపై మంచి పట్టు ఉండేది .. ఆ లక్షణమే బాలుకి అబ్బింది. ఊహ తెలిసిన దగ్గర నుంచి బాలు పాడిన స్టేజ్ పై ఆయనకి తప్ప వేరెవరికీ ప్రైజ్ వచ్చేది కాదు. స్నేహితుల ప్రోత్సాహంతోనే ఆయన సినిమాల్లో గాయకుడు కావడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ పాటల పోటీలో బాలు పాట విన్న సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి, 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమా కోసం మొదటిసారిగా పాడించారు.

కోదండపాణి ప్రోత్సాహంతో బాలు పాటల ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఆయన మైకు వెనక మాట్లాడింది తక్కువ .. మైకు ముందు పాడింది ఎక్కువ. అంతలా బాలు తన స్వర ప్రభంజనాన్ని సాగించారు. ఘంటసాలవారు సైతం ఆయన స్వర విన్యాసానికి ఆశ్చర్యపోయారు .. అభిమానంతో తనవంతు ప్రోత్సాహమిచ్చారు. అనారోగ్య కారణాల వలన ఘంటసాలవారు పాడలేని సమయానికి బాలు అందుకున్నారు .. తెలుగు పాటను ఆదుకున్నారు. బాలు పాటకు పడుచుదనం ఎక్కువ అనే విషయాన్ని ఇండస్ట్రీ గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

కాలంతో పాటుగా ట్రెండు మారుతూ వచ్చింది. దర్శక నిర్మాతలు మారుతున్నారు .. హీరోలు మారుతున్నారు .. సంగీత దర్శకులు మారుతున్నారు. కానీ మైకు ముందున్న బాలు మాత్రం మారలేదు. అంతగా ఆయన పాటను అలుముకున్నారు .. హత్తుకున్నారు. హీరోల వాళ్ల బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. మేనరిజమ్స్ .. డాన్సింగ్ స్టైల్ .. ఇలా అన్ని విషయాలను బాలు స్కాన్ చేసేవారు. అదే తరహాలో ఆయన మైకు ముందు విజృంభించేవారు. దాంతో ఏ హీరోకి పాడితే .. ఆ హీరోనే స్వయంగా పాడుతున్నట్టుగా ఉండేది. ఈ విషయంలో అల్లు రామలింగయ్య .. రాజబాబు కూడా మినహాయింపు కాకపోవడం విశేషం.

‘శంకరాభరణం’ .. ‘సాగరసంగమం’ పాటలు విన్నవారు, బాలు తనకి సంగీతం రాదని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో ఆయన చేసిన సాధనను తలచుకుని మరింత విస్మయానికి లోనయ్యారు. లాలి పాటల మొదలు అన్నిరకాల పాటలకు బాలు స్వరమే ఆధారమైంది .. ఆశ్రయమైంది. బాలు ఏ రకం పాటలు బాగా పాడతారు? అనే ప్రశ్నకి ఎప్పటికీ సమాధానం దొరకదు. ఏ చెట్టుకు .. ఏ కొమ్మకు తేనెపట్టు పెట్టినా అందులోని తేనె తియ్యగా ఉన్నట్టే, బాలు ఏ పాటపాడినా అది హాయిగానే వినిపిస్తుంది. ఆయన పాట విన్న తరువాత తేనెలో కూడా కాస్త తీపి తక్కువైనట్టుగానే అనిపిస్తుంది.

బాలు విషాద గీతాలు పాడినా .. ఫాస్టు బీట్లు పాడినా పదాలు స్పష్టంగా పలుకుతారు. తెలుగు భాషపై ఆయనకి గల అభిమానం అలాంటిది .. అక్షరాల పట్ల ఆయనకిగల అనురాగం అలాంటిది. బాలు పాటల్లో మెరుపులు .. విరుపులు .. సంగతులు .. చమక్కులు కనిపిస్తాయేగానీ, ఆకాశాన్ని భూతద్దంగా చేసుకుని చూసినా అక్షరదోషాలు మాత్రం కనిపించవు. ఇలా పాటల ప్రపంచంలో మేరుపర్వతంలా ఎదిగినప్పటికీ, వెన్నముద్దలానే ఆయన ఒదిగి ఉండేవారు. అహంభావానికి అందనంత దూరంలో వినయ విధేయతలు పొదిగినట్టుగా ఉండేవారు.

ఒక వైపున వివిధ రకాల భాషల్లో స్వర విన్యాసం చేస్తూనే, మరో వైపున అభిరుచి కలిగిన సినిమాలను నిర్మించారు. తెరపై నటుడిగా కనిపించాలనే ముచ్చట తీర్చుకున్నారు. కొన్ని సినిమాలకి సంగీతాన్ని కూడా అందించి అభినందనలు అందుకున్నారు. రజనీ .. కమల్ .. సల్మాన్ .. గిరీష్ కర్నాడ్ .. అర్జున్ వంటి హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ‘అన్నమయ్య’ సినిమాలో సుమన్ కి డబ్బింగ్ చెప్పి ఆ పాత్రకి ఒక నిండుదనాన్నీ .. పండుగదానాన్ని తీసుకొచ్చారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు తనని తాను ఆవిష్కరించుకున్నారు.

‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా బాలు ఊరూరా పాటల పందిళ్లు వేయించారు .. రాగాల సందళ్లు చేయించారు. తనకి ముందున్న గాయకులను గుర్తుచేయడం .. తన సమకాలీన గాయకులను సన్మానించడం .. కొత్త గాయనీ గాయకులలోని ప్రతిభను వెలికి తీయడం చేశారు. ఇలా ఒకే వేదికను అనేక విశేషాల సమాహారంతో అలంకరిస్తూ ఆయన చేసిన ‘రాగయాగం’ భవిష్యత్తులో వేరెవరికీ సాధ్యం కాదేమో. ఎందుకంటే ఆ అనుభవాన్ని అధిగమించడం .. ఆ స్వర శిఖరాలను అధిరోహించడం అసాధ్యమేనని చెప్పాలి.

బాలు ఎంత అద్భుతంగా పాడతారో .. అంతే అందంగా మాట్లాడతారు. ఆయన పాట పరవశమైతే, మాట పరిమళమనే చెప్పాలి. ఆయన మాటలో .. మనసులో .. పాటలో .. పలకరింపులో .. నవ్వులో స్వచ్ఛత కనిపిస్తుంది. వివిధ భాషల్లో 40 వేలకి పైగా పాటలు పాడిన బాలు .. బహుదూరపు పాటసారి అనిపించుకున్నారు. తన పిల్లలకు పల్లవి – చరణ్ అని పేర్లు పెట్టుకోవడాన్ని బట్టే, పాట అంటే ఆయనకి ఎంత ప్రాణమో అర్థం చేసుకోవచ్చు. గాయకుడిగా తనని ప్రోత్సహించిన కోదండపాణి పేరుతోనే ఆడియో ల్యాబ్ నిర్మించడం ఆయన మంచి మనసుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఉత్తమ గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సహాయ నటుడిగా బాలు అనేక అవార్డులను అందుకున్నారు. పద్మశ్రీ .. పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ అవార్డులు ఆయన కీర్తి కిరీటంలో ఇష్టంగా ఒదిగిపోయాయి. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా ఆ రాగాల రారాజును మనసారా స్మరించుకుందాం! వేల పాటల బాలుకి వేల వందనాలు సమర్పించుకుందాం!!

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్