కన్నడిగులందరికీ నమస్కారం. నేను తెలుగువాడినైనా మీరు నన్ను ఏనాడో దత్తత తీసుకున్నారు. 1966 డిసెంబరు 15న శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలో నా మొట్టమొదటి సినిమా పాట తెలుగులో పాడాను. అదే సంవత్సరం నేను పాడిన రెండో పాట కన్నడ(నక్కరే అదే స్వర్గ 1967లో విడుదలయ్యింది). ఆ క్షణంనుండి కన్నడలో పాడుతూనే ఉన్నాను. మీవాడినయ్యాను. మీ ఆనందానికి గొంతునయ్యాను. మరో జన్మంటూ ఉంటే కన్నడనేలమీద పుట్టి మీ రుణం తీర్చుకోవాలి. అంతగా మీరు నన్ను అభిమానించారు. ఆదరించారు. ఆశీర్వదించారు. మిగతా రాష్ట్రాలవారు కూడా నన్ను అభిమానిస్తారు కానీ…మీ అభిమానం మాత్రం వారందరికంటే ఎక్కువైనది. వెలకట్టలేనిది.
కన్నడ సినీ సంగీతంలో మేరునగధీరులైన రాజన్ నాగేంద్ర, విజయ్ భాస్కర్, ఉపేంద్ర కుమార్, జి కె వెంకటేష్, హంసలేఖ నాతో ఎన్నెన్నో గొప్ప పాటలు పాడించారు. వీరికితోడు ఇళయరాజా, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్ డి బర్మన్ ల సంగీత దర్శకత్వంలో కన్నడలో మంచి పాటలు పాడే అదృష్టం దొరికింది.
కన్నడ సినీ గేయరచయితలు విజయ నారసింహ, ఉదయశంకర, ఆర్ ఎన్ జయగోపాల్ రచించిన కస్తూరి పరిమళాల, కావేరీ గలగలల పాటలు పాడడంతో నేను మీ మనసుల్లో శాశ్వతస్థానం సంపాదించుకోగలిగాను.

రెండు మూడు తరాల హీరోలకు పాడాను. కన్నడ సినిమా హిమాలయం రాజ్ కుమార్ కు ఆయన వారసులందరికీ పాడాను. నేను నటించిన కన్నడ సినిమాలో నాకు రాజ్ కుమార్ గారు పాట పాడారు. అదొక వరం. పులకింత.
కర్ణాటక అంటే నాకు చాలా ఇష్టం. సంస్కృతికి, భక్తికి ఆలవాలమైన నేల. కన్నడ సినిమాల్లో కన్నడ భాష, కన్నడ సంస్కృతి, కన్నడ క్షేత్రాల మీద తప్పనిసరిగా పాటలు ఉంటాయి. ఇదొక గొప్ప గుణం. సంస్కారం.
సినిమాలకు సంబంధం లేకుండా కర్ణాటక హిమోఫిలియా(జన్యుపరమైన రక్త రుగ్మత)సొసైటీకి నేను కోశాధికారిని. దావణగేరిలో సొసైటీ అద్భుతమైన ఆసుపత్రిని నిర్వహిస్తోంది. ఎందరో దాతలు ఉదారంగా సహాయం చేశారు. చెప్పుకోవడం సభామర్యాద కాదు. ఇంకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉడతాభక్తిగా నావంతు పాటసాయం చేస్తుంటాను. అవన్నీ నా తృప్తికోసం. ఎంతో కొంత మీ రుణం తీర్చుకోవడం కోసం.
మీతో నాది జన్మజన్మల అనుబంధం. అది మాటలకు అందేది కాదు. కన్నడ పాటలో ప్రతిధ్వనించేది.
-ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
(ఈ కథనానికి ఆధారం బాలు సొంత యూట్యూబ్ చానెల్ వీడియోల్లో కన్నడలో మాట్లాడిన సింప్లీ ఎస్ పి బి మూడో ఎపిసోడ్)
బాలు అంతరంగం-4
నన్ను శంకరాభరణాన్ని చేసిన మహదేవన్

