Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచదువుతోపాటు సంగీత సాధన

చదువుతోపాటు సంగీత సాధన

మన పిల్లలకు ఎల్ కె జి నుండే ఐ ఐ టీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ కావడానికి లాంగ్ టర్మ్ మెగా ఇంటెన్సివ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ప్రధానం కాబట్టి తెల్లవారకముందే నిద్ర లేపి పంపాలి. సాయంత్రం అటునుండి అటే ఇంకో క్రాష్ కోర్స్ కోచింగ్ కు పంపాలి. అయితే ఐ ఐ టి. కాకపొతే ఎన్ ఐ టి. ఇక ఎందులో వచ్చినా అది చదువు కాదు. అలాగే మెడిసిన్ సీటు అడ్మిషన్ కోసం నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్. ఇన్ని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, క్రాష్ కోర్సుల మధ్య పిల్లలు ఒత్తిడిని తట్టుకుని భూమ్మీద మనుషుల్లో మనుషులుగా మనమధ్య మిగిలి ఉన్నారంటే కేవలం అది మన పూర్వజన్మల పుణ్యఫల విశేషం. ఫలితాల రోజు ఒకటి పక్కన ఒకటిగా రెండుగా కని పెంచిన మన పిల్లలు అంకెల్లో అంకెలుగా కనిపించే… ఆ విజయానందం ముందు ఎవరెస్టు కూడా చిన్నబోతుంది.

ముఖే ముఖే సరస్వతి. ప్రతి మనిషిలో ఒక విద్య ఉంటుంది. అందరూ ఒకేలా ఉండడానికి మనం రోబో యంత్రాలు కాదు కదా? సంగీతం, డ్యాన్స్, పెయింటింగ్ ఇలా ఎన్నెన్నో ఫైన్ ఆర్ట్స్ లో పిల్లలకు ఉత్సాహం ఉంటుంది. కొంచెం చేయి అందిస్తే అల్లుకుపోయే స్వతస్సిద్ధమైన ప్రతిభ ఏదో ఉంటుంది. సరైన ప్రోత్సాహం, తగిన శిక్షణ ఉంటే చాలు పిల్లలు చేయని అద్భుతాలు లేవు.

“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః”. చిన్నపిల్లలు మొదలు సృష్టిలో సంగీతానికి సకల ప్రాణులూ స్పందిస్తాయి. చిన్నప్పుడు నేర్చుకుంటేనే సంగీతం బాగా వంటపడుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ సంగీత ఉపాధ్యాయుడు, గాయకుడు కొమాండూరి రామాచారి లిటిల్ మ్యుజిషియన్స్ అకాడెమీ https://share.google/vGPuRgkbrClHN7R7C  నిర్వహిస్తున్నారు. (Mobile: 912117 7717 &
83090 64276‬)

26ఏళ్ళ సంస్థ ప్రయాణంలో వేలమంది పిల్లలు సంగీతం నేర్చుకున్నారు. తను పేదరికంనుండి ఎదిగివచ్చినవాడు కావడంతో డబ్బున్నవారు, లేనివారు అందరికీ సంగీతం నేర్చుకునే అవకాశాలు సమానంగా ఉండాలని భారతదేశంలో విద్యార్థులకు ఉచితంగా సంగీతం నేర్పుతున్నారు. విదేశాల విద్యార్థులదగ్గర మాత్రం ఫీజు తీసుకుంటారు.

ఆయన శిక్షణలో తయారై ఈటీవీ పాడుతా తీయగా ఫైనల్స్ విజేత అయిన హర్షిత; ఈటీవి బ్లాక్(అంధులకు పాటల పోటీ) విజేత శ్రావ్య, సినిమాల్లో పాడుతున్నవారు, కచేరీలు చేస్తున్నవారు…ఇలా ఎందరో ఉన్నారు. ఎలాంటి పోటీలకు, కచేరీలకు వెళ్లకపోయినా ఇష్టంగా నేర్చుకుంటున్నవారున్నారు. ఒకేసారి రెండు, మూడు వందలమంది విద్యార్థులకు సంగీత పాఠాలు బోధించడానికి వీలుగా ఈమధ్యే ఆయన బంజారాహిల్స్ లో పూర్తీ సౌండ్ ప్రూఫ్ అధునాతన స్టూడియో నిర్మించారు. ఇక్కడ ప్రతి ఆదివారం దాదాపు నాలుగు వందలమంది పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు.

కొత్త స్టూడియోలో శిక్షణ తరగతులు చూద్దురుకానీ రండని ఆహ్వానిస్తే ఒక ఆదివారం వెళ్ళాను. వెళ్ళేసరికి నేను ఎప్పుడో రాసి ఆయనకిచ్చిన “వెన్నపాల దొంగంటూ…విన్నపాలకొచ్చేరు
చిన్ని బిడ్డడు వీడు…జోల పాడరే!” పాటను తెలుగులో, ఇంగ్లిష్ లో ప్రతిపదార్థంతో వివరించి, పద విభజన చెప్పి, స్క్రీన్ మీద తెలుగు, ఇంగ్లిష్ రెండు లిపుల్లో పాటను డిస్ ప్లే చేస్తూ…వివరిస్తున్నారు. (అంతా ఇంగ్లిష్ మీడియం పిల్లలే కాబట్టి పాట తెలుగు లిపి పక్కనే ఇంగ్లిష్ లిపిలో కూడా తప్పనిసరి అవుతోంది) ఆ పాటను ఎలా భావిస్తూ పాడాలో దాదాపు రెండు గంటలపాటు వివరించారు. చివర ఈ పాట రాసింది ఈయనే అని నాతో మాట్లాడించారు.

అప్పటికే మధ్యాహ్నం రెండు కావస్తోంది. మధ్యాహ్నం బ్యాచ్ కూర్చునేలోపు భోంచేసి వెళ్ళండి అని పట్టుపట్టి చక్కటి భోజనం పెట్టారు. అక్కడ ఒకమ్మాయి ప్లేటు పట్టుకుని బుద్ధిగా తింటోంది. వెనక నిలుచుని అమ్మాయి తండ్రికూడా తింటున్నారు. ఏ ఊరు అని మాట కలిపాను. కడప అన్నారు.

ఆయన పేరు బి. చంద్రశేఖర్ (9502702722). చిన్న కిరాణా షాప్ ఓనర్. అమ్మాయి గంగ ఆర్తిశ్రీ కడపలో ప్రయివేటు స్కూల్లో నాలుగో క్లాస్ చదువుతోంది. చిన్నప్పటినుండి సంగీతమంటే ఆ అమ్మాయికి ఇష్టం ఏర్పడడానికి ఇంట్లో వాతావరణం కారణం. చంద్రశేఖర్ దంపతులకు భజన సంప్రదాయమంటే బాగా ఇష్టం. కడపలో ఎక్కడ అన్నమయ్య కీర్తనలు, ఇతర సంప్రదాయ సంగీత కార్యక్రమాలు జరిగినా వెళ్లేవారు. అమ్మాయిని కూడా వెంట తీసుకెళ్లేవారు. పెద్దవారితో సమానంగా అమ్మాయి పాడుతుండడంతో సంగీతంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడెమీ గురించి తెలిసి ఒకటిన్నర సంవత్సరంగా వస్తున్నారు.

ప్రతి శనివారం స్కూల్ అయ్యాక అమ్మాయి, తండ్రి రాత్రి 8గంటలకు కడపలో బస్సెక్కుతారు. ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్ లో దిగి క్లాసుకు వస్తారు. మధ్యాహ్నం అక్కడే భోంచేస్తారు. సాయంత్రం దాకా ఉండి రాత్రికి మళ్ళీ కడప బస్సెక్కుతారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఇల్లు చేరి…6.45 కు స్కూల్ కు వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి చెబుతున్నప్పుడు కళ్ళల్లో వెలుగు, మాటల్లో మెరుపు మాటలతో రాస్తే అందేది కాదు. ఒక్కో వారం దాదాపు నాలుగు వేల రూపాయలు ఖర్చవుతున్నట్లు చంద్రశేఖర్ చెప్పీ చెప్పకుండా చెప్పారు. బయట లాడ్జుల్లో దిగితే అనవసరంగా ఖర్చు కాబట్టి బస్సు దిగి నేరుగా అక్కడికే వచ్చేస్తున్నట్లు మాటల్లో అర్థమయ్యింది.

మీతో ఒక ఫోటో తీసుకోవాలి…మీ గురించి రాయడానికి అనుమతిస్తారా? అని అడిగాను. సరే అన్నారు. శ్రీకాకుళం, విశాఖ, నిజామాబాద్, మెదక్, వరంగల్ ఇలా ఎక్కడెక్కడినుండో వారంవారం కేవలం సంగీతం క్లాసుకోసం హైదరాబాద్ దాకా వచ్చి వెళుతున్న విద్యార్థుల పట్టుదల, క్రమశిక్షణ; వారివెంట ఇష్టంగా బాధ్యతగా వస్తున్న తల్లిదండ్రులను చూస్తుంటే రుబ్బుడు రోలు చదువులచుట్టూ కాకుండా పిల్లలకు ఇష్టమైన కళల్లో శిక్షణనిప్పిస్తున్న తల్లిదండ్రులు కొందరైనా ఉన్నందుకు ఆనందంగా ఉంది. వీరిలోనుండి వచ్చే ప్రొఫెషనల్ గాయకులు పాడే పాటలే రేప్పొద్దున మనం వినేవి.

సంగీతంతో చదువుమీద ఏకాగ్రత పెరుగుతుందని; జ్ఞాపకశక్తి పెరుగుతుందని; మనసు ఉల్లాసంగా ఉంటుందని శాస్త్రీయమైన అధ్యయనాల్లో తేలింది. పుస్తకాలతో పాటు ఇలాంటి ఏదో ఒక సృజనాత్మక కళల్లో పిల్లలను ప్రోత్సహిస్తే వారికీ మంచిది. మనకూ మంచిది.

“అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యగుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ వినుర వేమ”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular