Friday, June 12, 2026

బాలు అంతరంగం-4

చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇన్ని భాషల్లో ఇన్ని వేల పాటలు పాడారు…ఎన్నెన్నో అవార్డులు వచ్చాయి…మీకెలా అనిపిస్తూ ఉంటుంది– అని. మనం చేసే పని మాట్లాడాలి తప్ప మనకు మనమే గొప్పలు చెప్పుకోకూడదని పెద్దలను చూసి నేర్చుకున్నాను. దీనికి మీకో ఉదాహరణ చెప్పాలి.

మా ఇంట్లో, సన్నిహిత బృందంలో అందరూ నన్ను మణి అని పిలుస్తారు. దాంతో ప్రఖ్యాత సంగీత దర్శకులు మహదేవన్ గారు, చక్రవర్తిగారు కూడా నన్ను మణి అనే పిలిచేవారు. ఒకరోజు మద్రాసులో ఒక కార్యక్రమం అయిపోయాక మహదేవన్ గారిని కారులో ఎక్కించుకుని ఇంటిదగ్గర డ్రాప్ చేయడానికి బయలుదేరాను. నేనే కారు డ్రయివ్ చేస్తున్నాను. ఆయన పక్కన కూర్చున్నారు. కారులో టేప్ రికార్డర్ లో క్యాసెట్ ప్లే చేశాను. “ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులూదగా…” పాట వస్తోంది. “అరే మణి పాట చాలా బాగుందిరా…నువ్ పాడావు…తెలుస్తోంది…ఎవరు కంపోజ్ చేశార్రా?” అన్నారు. నన్ను ఆట పట్టించడానికి అలా అడుగుతున్నారనుకుని నేను నవ్వాను. “నాతోపాటు జానకమ్మ పాడారు. శంకరాభరణంలో పాట. సామజవరగమనా కీర్తనకు మధ్యలో వేటూరిగారు రాసిన ఒక చరణమిది. మీరే కంపోజ్ చేశారు మామా!” అన్నాను. కారాపురా! అన్నారు. పక్కకు ఆపాను. ఇంజిన్ కూడా ఆపమన్నారు. ఆపాను.

ఏమిట్రా మణి? ఈ శంకరాభరణం? మనల్ను ఎక్కడిదాకా తీసుకెళుతుందో ఇది? అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడతాం. ఎక్కడికెళ్ళినా వేటూరిగారి రచన; విశ్వనాథ్ గారి దర్శకత్వం; కొత్తాయన సోమయాజులు నటన…అన్నిటికీ మించి మన సంగీతంగురించి తెగ మాట్లాడుతున్నారు. పొగుడుతున్నారు. ఇక ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా? అంటున్నారు. ఒకదశ దాటి పొగడ్తలు వింటుంటే భయంగా ఉందిరా! మనవాళ్లందరికీ చెప్పాను. నీకూ చెప్తున్నా. ఎవరైనా సరే మన ముందు శంకరాభరణం పాటలను పొగిడితే తల ఒంచుకు విని అంతా అయిపోయాక ఒక నమస్కారం పెట్టి పక్కకు వెళ్ళిపోవాలి తప్ప…అవును మేమే చేశాం అని తల ఎత్తుకుని సమాధానం ఇవ్వనే వద్దు. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. మళ్ళీ మళ్ళీ ఇంత గొప్పగా చేస్తామో! లేదో! తెలియదు- అన్నారు. కారులోనే ఆయన కాళ్లకు నమస్కారం పెట్టాను.

మామ దగ్గర పాడని గాయకులు లేరు. నాముందు మూడు తరాల చేత పాటలు పాడించినవాడు. అమృతమయమైన గీతాలను లోకానికి ఇచ్చినవాడు. పరిశ్రమలో చిన్నాపెద్ద అందరిలో ఒకడు. అలాంటివాడు తను చేసిన పాట కీర్తి నుండి పక్కకు జరిగి నాకు అలా ప్రాక్టికల్ గా పాఠం చెప్పారనిపించింది. శాస్త్రీయ సంగీతంలో నాకేమి తెలుసో నాకు స్పష్టత ఉంది. అలాంటి నన్ను శంకరాభరణాన్ని చేసి మీ ముందు నిలబెట్టినవారు మహదేవన్ గారు, ఆయన సహాయకుడు పుహళేంది గారు. అంతటి మహదేవన్ గారే అలా ఉంటే ఇక నేనెలా ఉండాలి? మనిషి మనిషిగా ఉండడమే కష్టం. మీరు నన్ను అభిమానిస్తున్నారంటే ఆ అభిమానానికి నా వెనుక ఉన్న ఇలాంటివారందరూ కారణం.

మహదేవన్ గారి వివేచన, వినయంగురించి పుహళేందిగారు నాకు ఎన్నో సంగతులు చెప్పారు. అందులో కొన్నిటికి నేను ప్రత్యక్ష సాక్షిని కూడా. రోజూ ఉదయాన్నే ప్రొడక్షన్ వెహికిల్ ఉన్నా సరే పుహళేందిగారే మామ ఇంటికి వెళ్లి ఎక్కించుకుని…రికార్డింగ్ అయిపోయాక మళ్ళీ ఇంట్లో దించి రావాలి. మామ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి ఎరుగరు పుహళేందిగారు. మామ పంచ ప్రాణాలు పుహళేందిగారు. ఒకసారి తమిళ పాట రికార్డింగ్ లో గాయకుడు సౌందర్ రాజన్ నాలుగు టేక్ లయినా సరిగ్గా పాడలేకపోతున్నారు. పుహళేంది గారు మరో టేక్ చెప్పబోతుంటే మామ మైక్ అందుకుని లాస్ట్ టేక్ ఓకె. ప్యాకప్ అన్నారు. ఇంటికెళ్ళాక ఏనాడూ వాదించని పుహళేందిగారు మీరు చెప్పిన సంగతి పాడలేదు…అందుకే టేక్ లు చెబుతూనే ఉన్నాను…అని వివరణ ఇచ్చుకోబోయారు. ఒరేయ్ పిచ్చి వెధవా! మనం స్వరపరిచినది ఆయనకు అంత సౌకర్యంగా లేదేమో! ఎందుకు అంతగా హింసించడం? పైగా అందరిముందు గాయకుడికి అవమానం. నిర్మాతకు నష్టం. సమయం సందర్భం చూసుకోవాలి- అని అనునయించారు.

ఇలాంటివారిదగ్గర సంగీతం కొద్దిగా నేర్చుకున్నా పరవాలేదు కానీ…జీవన పాఠాలు మాత్రం అన్నీ నేర్చుకోవాలి. మామ భౌతికంగా మనమధ్య లేరు. అజరామరమైన ఆయన పాటలున్నాయి. ఆయన పాటించిన విలువలున్నాయి. ఆయన నేర్పిన పాఠాలున్నాయి. అవే నాలాంటివారికి దారి దీపాలు.

-ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular