ఈరోజుల్లో అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలద్వారా మీతో తరచుగా మాట్లాడాలని అనుకుంటున్నా. ఎవరికివారు నన్ను తమభాషవాడిగానే సొంతం చేసుకున్నారుకాబట్టి అన్ని భాషలు కలగలుపుతూ మాట్లాడతాను. ఆ విషయానికున్న భాషాప్రాధాన్యాన్ని బట్టి ఎక్కువగా ఏ భాషలో మాట్లాడాలో సందర్భమే నిర్ణయిస్తుంది. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిష్, తమిళం, కన్నడ భాషలుంటాయి.
విద్యార్థిగా ఉంటూ పాటల పోటీల్లో పాల్గొనడం దగ్గర మొదలుపెడితే ఎక్కడిదాకా వెళుతుందో నాకే తెలియదు. అందరికీ తెలిసిన విషయాలు కాకుండా చాలాకాలంగా నాలో దాగినవి, లోకానికి తెలియాల్సినవి ఎక్కువగా ప్రస్తావిస్తాను.
సినిమాల్లో పాడడానికి నాకు అవకాశాలు ఇప్పించాలని కోదండపాణిగారు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఎందరికో చెప్పారు. కానీ కుదరలేదు. అనవసరంగా చదువు దెబ్బతింటుందని మద్రాసు వదిలి వెళ్ళిపోయాను. రెండేళ్ళు చదువుమీదే దృష్టిపెట్టాను. కోదండపాణిగారు ఎలాగో నన్ను మళ్ళీ పట్టుకున్నారు. పద్మనాభం నిర్మాతగా మర్యాద రామన్న సినిమాలో పాడడానికి తొలిసారి కోదండపాణిగారే అవకాశమిచ్చి ఆశీర్వదించారు. మిగిలిన కథ మీకు తెలిసిందే.

అయితే కోదండపాణిగారు నన్ను మొదట గుర్తించిన సంగతులు ఇక్కడ నెమరువేసుకోవాలి. మా ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు. ఊళ్ళో షాపులదగ్గర, ఫ్రెండ్స్ ఇళ్లల్లో రేడియోలో, ఫంక్షన్స్ కు వెళ్ళినచోట్ల మహమ్మద్ రఫీ పాటలు వినేవాడిని. ఆ పాటల్లో ఏదో మాధుర్యం నావెంట పడేది. పాట పాడుతున్నప్పుడు అలా పలకడానికి ఆయన ఎలా ప్రయత్నించి ఉంటారో ఊహించేవాడిని. మైకు ముందు అభినయించకపోతే అంత అందంగా, భావం స్ఫూరించేలా ఎలా పాడగలరు? అనుకుంటూ అలాగే అభినయిస్తూ పాడేవాడిని. మరికొంత స్వేచ్ఛ తీసుకుని ఆలాపన పెంచేవాడిని. గమకాలను జోడించేవాడిని. అలా నేను చేసిన మార్పులను కోదండపాణిగారు పట్టుకుని ఎందుకలా చేశావని అడిగారు. బాగుంటుందని చెప్పాను. నీకు చాలా భవిష్యత్తు ఉంది. రాణిస్తావు- అని ఆశీర్వదించారు. అభినందించారు. అలా కోదండపాణి మనసు గెలవడమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. మహమ్మద్ రఫీ ప్రభావమే నన్ను మీరందరూ మెచ్చే గాయకుడిగా నిలబెట్టింది.
కాబట్టి ఆ మహమ్మద్ రఫీ పాట; శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నలో కోదండపాణిగారు పాడించిన నా మొట్టమొదటి సినిమా పాట…రెండూ నాకు రెండు కళ్ళలాంటివి. నా భవిష్యత్తుకు పునాది అయినవి.
-ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
(ఈ కథనానికి ఆధారం బాలు సొంత యూట్యూబ్ చానెల్ వీడియోల్లో సింప్లీ ఎస్ పి బి మొదటి ఎపిసోడ్. అందుకు వారి వారసులకు కృతఙ్ఞతలు. బాలుకు నమస్సులు)
బాలు అంతరంగం-3
అక్కున చేర్చుకున్న కన్నడ సీమ

