Monday, August 10, 2026

బాలు అంతరంగం-1

గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మనమధ్య జీవించినకాలం డెబ్బయ్ నాలుగేళ్లు. ఇరవై ఏళ్ల వయసులో పాడడం మొదలు పెట్టి నలభై వేల పాటలు పాడాడు. నలభై వేలను యాభైనాలుగేళ్ళతో భాగిస్తే సంవత్సరానికి ఏడు వందల నలభై పాటలు. అంటే నెలకు అరవై రెండు పాటలు. సగటున రోజుకు రెండు పాటలు పాడినట్లు. ఒక మనిషికి ఇది సాధ్యమేనా? బాలుకు మాత్రమే సాధ్యం.

అతిపరిచయం వల్ల చెప్పడానికి ఏమీ మిగిలి ఉండదు. అలా బాలసుబ్రహ్మణ్యం గురించి, ఆయన పాటల గురించి తెలియనిదెవరికి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏముంది? గొప్పగా పాడాడు. కష్టమయినవి పాడాడు. సులభంగా పాడాడు. సున్నితంగా పాడాడు. సంప్రదాయం ఒడిసిపట్టుకుని పాడాడు. స్పష్టంగా పాడాడు. తెలుగును తెలుగులా పలికాడు. అక్షరాన్ని మింగేయకుండా పాడాడు. ఊపిరి బిగబట్టి పాడాడు.

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విని తరించరా! అన్నాడు.

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే! అన్నాడు.

పారేసుకోవాలనారేసుకున్నావు..
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. అన్నాడు.

ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తే బాలు పాటల చరిత్ర పూర్తవుతుంది? తెలుగుపాట అప్పుడు ఘంటసాలను కోరుకుంది. ఆయన పోతూ పోతూ ఆ పాటను బాలు చేతిలో పెట్టి వెళ్లాడు. బాలు పోతూ పోతూ ఆ పాటను ఎవరిచేతిలో పెట్టాలో తెలియక వెళ్లిపోయాడు.

పాటంటే నిజానికి ఒక పల్లవి. రెండు చరణాలే. కానీ మాటలు చెప్పలేని భావమేదో పాటలు చెప్పాలి. పాటలో ఒక్కొక్క మాట వేనవేల మాటలుగా ప్రతిధ్వనించాలి. ప్రతిపదం భావార్థంగా ప్రతిఫలించాలి. అలా బతుకంతా పాటలతో ప్రతిధ్వనించి, పాటగా ప్రతిఫలించిన బాలుగురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన పాటలు వినడం సులభం.

అలాంటి ఆ పాటలగురించి, ఆ పాటల దారుల్లో ఎదురైన అనుభవాలగురించి, ఆ పాటలవెనుక సంగీత దర్శకులు, రచయితలగురించి, ఇతర గాయకులగురించి బాలు తన యూ ట్యూబ్ ఛానెల్లో దాదాపు 40ఎపిసోడ్లలో “సింప్లీ ఎస్ పి బి” పేరిట ధారావాహికగా ఎన్నో సంగతులు చెప్పారు. తనమానాన తను పాడి వెళ్ళిపోవడం వేరు. ఆ పాటల పుట్టుక మొదలు జనం నోళ్ళల్లో నానేదాకా అన్ని విషయాలను పూసగుచ్చినట్లు చెప్పడం వేరు. గానంతోపాటు వ్యాఖ్యానం బాలుకు అదనపు బలం. మిమిక్రీ, నటన ఇలా ఇంకా చాలానే ఆయన కీర్తి కిరీటంలో ఉన్నాయి. మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు బాలు ఆ ధారావాహికల్లో చెప్పారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు వరుసగా idhatri.com లో ప్రచురితమవుతాయి.

(ఈ కథనాలకు ఆధారం బాలు సొంత చానెల్ వీడియోలు. అందుకు వారి వారసులకు కృతఙ్ఞతలు. బాలుకు నమస్సులు)

బాలు అంతరంగం-2
“మహమ్మద్ రఫీ ప్రభావం”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular