అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ కమలం పార్టీలో కలవరం మొదలైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వానికి డోకా లేదని నేతలు పైకి చెపుతున్నా, వాస్తవ పరిస్థుతులు భిన్నంగా ఉన్నాయనే నివేదికలు హస్తినకు అందుతున్నాయి. రెండు నెలల నుంచి పార్టీ జాతీయ నేతలు లక్నో వస్తే యోగి సమర్థత పై ఫిర్యాదులు రావటం పరిపాటిగా మారింది. నేతలు ఎవరు బహిరంగ విమర్శలు చేయకపోయినా అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీంతో కమలం పార్టీ జాతీయ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగింది.
ఢిల్లీ లో నేతల హడావిడి చూస్తుంటే ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నట్టు గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యుపి గవర్నర్ ఆనంది బెన్ ను ఈ రోజు లక్నో లో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్, కేంద్ర మాజీ మంత్రి రాధ మోహన్ సింగ్ కలుస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానుండటంతో వీరి భేటి ప్రాధాన్యం సంతరించుకొంది. మంత్రి వర్గంలో భారీ మార్పులే ఉండే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.
మే 27 వ తేదిన గవర్నర్ ఆనంది బెన్ తో సిఎం యోగి భేటి అయ్యారు. కరోన కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని గవర్నర్ కు వివరించినట్టుగా ఆ రోజు ప్రకటన విడుదల చేశారు. అయితే అధికారులు ఎవరు లేకుండా గంట పాటు ఏకాంతంగా జరిగిన సమావేశంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పైనే చర్చ జరిగినట్టు పాత్రి నేతలే అంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విశ్వాసనీయుడిగా పేరున్న మాజీ బ్యూరోక్రాట్ ఏకే శర్మ యుపి లో తాజా స్థితిగతులపై ప్రధానికి ఓ నివేదిక సమర్పించారని సమాచారం. మరోవైపు ఆర్.ఎస్.ఎస్ కు కూడా యోగి పై ఫిర్యాదులు అందాయి. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె మే నెలలో లక్నో వచ్చినపుడు సంఘ్ నేతలు, పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యోగి నాయకత్వం పై మెజారిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన అంశాల్లో పార్టీ నేతల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా యోగి ఏకపక్షంగా వ్యవహరిస్తారని నేతలు ఫిర్యాదు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయం, కరోన కట్టడిలో యోగి పై విమర్శలు పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంచాయతి ఎన్నికల్లో ఓటమి తర్వాత యుపి పరిణామాలపై లక్నో, ఢిల్లీ లలో బిజెపి అగ్ర నేతల సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి సంతోష్ లక్నో లో మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో భేటి అయ్యారు. ముఖాముఖి సమావేశంలో యోగి నాయకత్వం పై నేతలు శరపరంపరగా చేసిన ఫిర్యాదులతో పార్టీ జాతీయ నాయకత్వంలో కదలిక మొదలైంది.
మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తే కమల దళానికి ఎంతవరకు మేలు జరుగుతుందో వేచి చూడాలి.