Sunday, January 19, 2025
Homeజాతీయంప్రఫుల్ ను తొలగించండి : ఎన్సీపి ఎంపి

ప్రఫుల్ ను తొలగించండి : ఎన్సీపి ఎంపి

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తీరుపై బిజెపిలోనే బిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్షద్వీప్ బిజెపి అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ ప్రఫుల్ కు అండగా ఉండగా, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖాసిం ప్రఫుల్ చర్యలను నిరసిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ప్రఫుల్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలలకు నిరసనగా 8 మంది యువమోర్చా నేతలు రాజీనామా చేశారు. బిజెపిలో వచ్చిన ఈ భిన్న స్వరాలు విపక్ష నేతలు చేస్తున్న ఆందోళనలకు వూతమిచ్చినట్లు అయ్యింది.

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రఫుల్ పటేల్ అయన మంత్రివర్గంలో హోం శాఖ నిర్వహించారు. అమిత్ షా తో కూడా ప్రఫుల్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ప్రఫుల్ చర్యను గట్టిగా వ్యతిరేకించడానికి బిజెపి నేతలు ముందుకు రావడం లేదనే విమర్శలున్నాయి.

ద్వీపంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ఆవేదనను ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు ఆలకించాలని లక్షద్వీప్ ఎంపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఫైజల్ డిమాండ్ చేశారు. వెంటనే ప్రఫుల్ ను వెనక్కి పిలిపించి కొత్త పాలకుణ్ణి నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నిరసనలకు మద్దతు తెలుపుతున్నామని, ఈ అంశానికి ఎక్కడా మతం రంగు పులమడం లేదని వివరించారు.

ప్రఫుల్ ను మోడీ ప్రభుత్వం దాద్రా నగర్ హవేలీ, డయు అండ్ డామన్ లకు అడ్మినిస్ట్రేటర్ గా నియమించింది. లక్ష ద్వీప్ అడ్మినిస్ట్రేటర్ దినేష్ శర్మ మరణంతో ఆ ద్వీపానికి కూడా ప్రఫుల్ ని అదనపు బాధ్యత అప్పగిస్తూ నియమించింది.  అయితే అయన బాధ్యతలు తీసుకోగానే తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర అందోళనలకు దారితీశాయి.

ముస్లిం లు అధికంగా ఉండే లక్షద్వీప్ లో బీఫ్ ను బ్యాన్ చేయడం, క్రైమ్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ గూండా యాక్ట్ తీసుకురావడం, ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరిస్తూ చట్టం తేవడం, భూములు సమీకరించే అధికారాలిస్తూ ఓ ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయడం లాంటి నిర్ణయాలను ఆ ద్వీపంలోని మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్