రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ద్వారా.. గ్రామీణ ప్రాంతంలోని యువత చదువుతోపాటు, ఆరోగ్యం, క్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు సీఎం కేసీఆర్ చేసిన ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంగళవారం ఆయన జిల్లాలోని మహబూబ్‌నగర్ మండలం మాచన్ పల్లి గ్రామంలో రూ. 4 లక్షల 75 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ యువతతో కలిసి ఉత్సాహంగా వాలీబాల్, కబడ్డీ ఆడారు.
అనంతరం పక్కనే ఉన్న కబడీ క్రీడా ప్రాంగణంలోకి చిన్నారులను పిలిచి కబడ్డీ ఆడించారు. చక్కగా రాణించిన చిన్నారులను శాలువాలతో సన్మానించి అభినందించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడమే కాకుండా, వాలీబాల్ గ్రౌండ్, షటిల్ గ్రౌండ్ తో పాటు, వాటికి అవసరమైన పోల్స్, ఇతర క్రీడా సాగ్రిని అందిస్తున్నామన్నారు.
క్రికెట్ కిట్లు కూడా ఇచ్చామన్నారు. గ్రామీణ యువత ఆటపాటలతో సంతోషంగా గడపాలన్నదే తమ లక్ష్యమని, అందులో భాగంగా వీటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 100% క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, వీటన్నింటిపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త క్రీడా పాలసీని తీసుకువచ్చి అన్ని క్రీడలలో సీఎం కప్ ను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి క్రీడా ప్రాంగణం చుట్టూ మొక్కలతో ప్రహరీని నిర్మించాలని అధికారులను ఆదేశించారు.