ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై శ్రీలంక 175 పరుగులతో ఘనవిజయం సాధించింది. లంక బౌలర్ వానిందు హసరంగ 6 వికెట్లతో ఎమిరేట్స్ బ్యాటింగ్ లైనప్ ను కాకావికలం చేశాడు.
బులావాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన మ్యాచ్ లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక బ్యాట్స్ మెన్ కుశాల్ మెండీస్-78; సమర విక్రమ-73; పాథుమ్ నిశాంక-57; కరుణరత్నే-52; అసలంక-48; వానిందు హసరంగ-23 (నాటౌట్) పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 355 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో అలీ నాసర్ 2; ముస్తఫా, అయాన్ ఖాన్, బాసిల్ అహ్మద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమిరేట్స్ 36 పరుగులకు తొలి వికెట్ (ముస్తఫా-12) కోల్పోయింది. ముహమ్మద్ వసీమ్-39; వృత్యా అరవింద్-39; అలీ నాసర్-34; రమీజ్ షాజాద్-26 పరుగులు మాత్రమే చేశారు. 39 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హసరంగ 6; లాహిరు కుమారా, మహీష తీక్షణ, ధనుంజయ డిసిల్వా తలా ఒక వికెట్ పడగొట్టారు.
హసరంగకే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.