శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ అమెరికాలో లంకవాసులు ఆందోళనకు దిగారు. లాస్ ఏంజిల్స్ లో రాజపక్స కుమారుడి నివాసం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విపత్కర పరిస్థితుల నుంచి లంక వాసులను ఆదుకునేందుకు ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు ఇస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. మరోవైపు, శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వెల్లడించింది.
శ్రీలంకలో ప్రస్తుతం రాజకీయ నేతలందరూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. శ్రీలంకను బాగు చేయడం … ప్రజల అవసరాలు తీర్చడం తమ వల్ల కాదని చేతులు ఎత్తెస్తున్నారు. సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించాల్సిన మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. స్వార్థ పాలనతో శ్రీలంకను పుట్టి ముంచిన రాజకీయ నేతలు ! ప్రస్తుత ప్రభుత్వమే కాదు.. గత ప్రభుత్వం కూడా శ్రీలంకలో ఈ దుస్థితికి కారణం. ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరికి మించి ఒకరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడటమే కాక… ఇష్టారీతిన అప్పులు చేసి.. అనుత్పాదక వ్యయం చేశారు. ఇప్పుడు అప్పుల కుప్పలా మారిన శ్రీలంకకు కొత్త అప్పులు ఎవరూ ఇవ్వకపోగా పాత అప్పులు గుండెల మీద కుంపటిలాగాఉన్నాయి. అడిగినప్పుడల్లా అప్పులు ఇచ్చి.. శ్రీలంకకు ఈ పరిస్థితి రావడానికి కారణం అయిన చైనా.. చైనాను సమర్థిస్తూ పరిపాలించిన పాలకులు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. తమ ప్రజల గురించి ఆలోచించడం లేదు.
శ్రీలంక ప్రజలు ఇప్పుడు తిండి తిప్పలులేక అల్లాడిపోతున్నారు. ఆ దేశం పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఇప్పుడు దిగుమతలకుపైసా డబ్బు లేదు. పెద్దఎత్తున అప్పులు ఉన్నాయి. దేశాన్ని చక్కదిద్దాలంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ దుస్థితికి తెచ్చిన పాలకులు ఒక్కొక్కరు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ప్రజలు మాత్రం రోడ్డున పడి… ఏడుస్తున్నారు. గుణపాఠం నేర్పుతున్న ఆకలితో అలమటిస్తున్న శ్రీలంక ప్రజలు. ఆహార పదార్థాల కొరతతో 50 శాతం మంది కేవలం ఒక పూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 55 శాతం మంది ప్రజలు దినసరి వేతన కార్మికులే. రూ.22 వేల జీతంతో నెల రోజులపాటు నిత్యవసరాలు పొందేవారు ఎక్కువగా ఉన్నారు.
ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చిన వారు బాగున్నారు. ప్రజల కోసమే అంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వారికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది. ప్రజలు మాత్రమే నరకం చూస్తున్నారు. సిలోన్ లో పరిస్థితి ఇప్పుడల్లా మెరుగుపడే అవకాశం లేదు. ఆర్థిక విధ్వంసాన్ని మళ్లీ సరిదిద్దడానికి సమయం పడుతుంది. అప్పటి వరకూ ప్రజలు అనుభవించాల్సిందే. బాధ్యత లేని పాలకుల్ని ఎన్నుకున్న శ్రీలంక ప్రజలు అనుభవిస్తున్న వేదన ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్‌కు గుణపాఠం లాంటిది.
Also Read : కుటుంబాన్ని కాపాడేందుకు రాజపక్స ఎత్తుగడలు