Srilanka Inflation : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం శ్రీలంకలో కిలో చికెన్ ధర రూ.800 నుంచి వెయ్యి వరకు పలుకుతుండగా.. కోడి గుడ్డు ఒక్కోటికి 35రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కిలో ఉల్లిపాయలు రూ.200- రూ.250, కేజీ పాల పొడి రూ.1,945, కేజీ గోధుమ పిండి రూ.170-220, లీటర్ పెట్రోలు రూ.283, డీజిల్ రూ.220కి విక్రయిస్తున్నారు.
లీటరు కొబ్బరి నూనె రూ.850 నుంచి రూ.900 మధ్యగా ఉంది. ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక రూపాయి మారకపు విలువ 270 వరకు పడిపోయింది. ఫలితంగా నిత్యావసర వస్తువులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోలు కోసం ప్రజలు బంకుల వద్ద క్యూలైన్‌లో పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు ఆయిల్ ఫిల్లింగ్ కేంద్రం వద్ద వరుసలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు మృత్యువాతపడ్డారు.
ఇంధనం కొరత తీవ్రం కాకుండా భారత్ నుంచి పెట్రోల్, డీజిల్‌ను తెప్పించుకున్నట్లు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ సుమిత్ తెలిపారు. ముడిచమురు స్టాక్ అయిపోవడంతో శ్రీలంకలోని ఏకైక రిఫైనరీని ఆదివారం మూసివేసినట్టు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అశోక్ రణ్‌వాలా అన్నారు. అయితే, దీనిపై లంక ఇంధన శాఖ స్పందించలేదు.
గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో అత్యల్ప ఆదాయ వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయంగా కిరోసిస్‌ను వాడుతున్నారు. 12.5 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.1,359గా ఉంది. జనవరి నుంచి శ్రీలంకలో ఆయిల్ ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి ఫిబ్రవరి నాటికి 2.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫిబ్రవరిలో ఆసియా దేశాల్లో మరెక్కడా లేనివిధంగా శ్రీలంక ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో 15.1 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతానికి చేరుకున్నాయి. దీనికితోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Also Read : శ్రీలంకలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు