Sunday, January 19, 2025
HomeTrending Newsధనుష్కోడికి పోటెత్తిన లంక శరణార్థులు

ధనుష్కోడికి పోటెత్తిన లంక శరణార్థులు

శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేక అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. శ్రీలంకలో సాధారణ పౌరులు ఏదీ కొనే స్థితి కనిపించడంలేదు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎంత డబ్బు పెట్టినా నిత్యావసరాలు అందని దుస్థితి నెలకొంది. చమురు ధరలు ఎప్పుడో అదుపుతప్పాయి. దానికితోడు తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది.

ఈ నేపథ్యంలో, శ్రీలంక నుంచి భారత్ కు వస్తున్న శరణార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, శ్రీలంకలోని జాఫ్నా, తలై మన్నార్, ట్రిన్ కోమలీ ప్రాంతాల నుంచి తమిళనాడులోని ధనుష్కోడి వస్తున్నారు. రెండు నెలల నుంచి వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారంతా  నాటు పడవలు, బోటులో వస్తున్నారు. భారత్ లో ఆశ్రయం కోసం వారు దేశాన్ని వీడామని, శ్రీలంకలో సాధారణ జీవనం అత్యంత కష్టసాధ్యంగా మారిపోయిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. గత కొన్నిరోజుల వ్యవధిలో శ్రీలంక నుంచి తమిళనాడు తీరానికి చేరుకున్న వారితో కలిపి శరణార్థుల సంఖ్య 1000 కి పెరిగింది.

తమిళనాడుకు చెందిన క్యూ బ్రాంచ్ పోలీసులు భారత్ తీరజలాల్లో గస్తీ ముమ్మరం చేశారు. శ్రీలంక నుంచి వస్తున్న వారిలో ఎక్కువగా లంక తమిళులు ఉంటున్నారు. మహిళలు, చిన్నారులతో కూడిన బోటు ఈ రోజు(సోమవారం) వేకువజామున 2 గంటలకు ధనుష్కోడి రాగా అక్కడ సిఐడి విభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ బ్రాంచ్ పోలీసులు వారిన అదుపులోకి తీసుకుని శరణార్థి శిభిరాలకు పంపించారు.

తమిళనాడులోని ధనుష్కోడికి శ్రీలంకలోని తలైమన్నార్ కేవలం 24 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంటుంది. దీంతో బతుకుజీవుడా అంటూ లంక వాసులు ఇండియాకు వస్తున్నారు. 81 బిలియన్ డాలర్ల విలువైన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. చేసిన అప్పులు చూస్తే, తమ వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యానికి మూడింతలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందడంలేదు.

Also Read : శ్రీలంక సంక్షోభానికి భారత రూపాయితో వైద్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్