Sunday, November 10, 2024
HomeTrending Newsశ్రీవారి లడ్డూ చుట్టూ రాజకీయాలు

శ్రీవారి లడ్డూ చుట్టూ రాజకీయాలు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. గత పాలకుకు తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశారని, స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసి ఆందోళన చెందానని,  ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొన్న జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంలో ఈ వార్త బైటకు రాగానే భక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా స్పందించడం మొదలు పెట్టారు. హిందూ సంఘాలు, బిజెపి, పరివార్ సంస్థల నేతలు కూడా దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

అయితే బాబు వ్యాఖ్యల తీవ్రత వెంటనే గ్రహించిన వైసీపీ నేతలు, గత ప్రభుత్వంలో టిటిడి ఛైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు కూడా స్పందించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గమని,  రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని వైవీ స్పందించారు.

నేడు ఈ ఆందోళన జాతీయ స్థాయికి చేరింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అయోధ్య ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్, విహెచ్ పి తో పాటు కేంద్ర మంత్రులు కూడా దీనిపై స్పందించారు. వివిధ రాష్ట్రాల్లో హిందూ సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించడం గమనార్యం. చంద్రబాబు చెప్పిన మాటలు నిజమైతే వెంటనే దోషులను శిక్దించాలని వారు కోరుతున్నారు. 50 ఏళ్ళుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్‌కి చెందిన నందిని నెయ్యిని కాదని తమిళనాడు కంపెనీకి ఏ ఆర్ కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడం కూడా వివాదమైంది.

ఈ వివాదం హైకోర్టుకు కూడా చేరింది. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై దుష్ప్రచారం  జరుగుతోందంటూ హైకోర్టును ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ప్రసాదం తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె వాడారంటూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై వెంటనే కమిటీ వేసి విచారించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అయితే స్పందించిన హైకోర్టు ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, వచ్చే బుధవారం విచారణ చేపడతామని తెలిపింది.

ఇదే విషయమై మాజీ సిఎం వైఎస్ జగన్ కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. మరోవైపు చంద్రబాబు అధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు, లడ్డూ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టిటిడి ఈవో జె.శ్యామలరావును ఆదేశించారు. శ్రీవారి ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏది ఏమైనా కోట్లాదిమంది విశ్వాసానికి సంబంధించిన ఈ విషయంలో రాజకీయం చోటు చేసుకోవడం దురదృష్టకరం, ఈ విషయంలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వెంటనే నిజానిజాలు వెల్లడించాలి భక్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2

న్యూస్