Sunday, September 8, 2024
HomeTrending Newscongress: ప్రభుత్వ సుస్థిరతపై నేతల మల్లగుల్లాలు

congress: ప్రభుత్వ సుస్థిరతపై నేతల మల్లగుల్లాలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నా.. పార్టీ నాయకత్వంలో మరో భయం కూడా మొదలైంది. కావలసినంత మెజారిటీ ఉన్నా తేడాలు వస్తే పెను ముప్పు తప్పదని ఢిల్లీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 119 స్థానాల్లో కాంగ్రెస్ కు 64 రాగా బీఆర్ఎస్ కు 39, బిజెపి-08, ఎంఐఎం -07, సిపిఐ-1 గా పార్టీల బలాలు ఉన్నాయి. సిపిఐ మిత్ర పక్షం కావటంతో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే ముఖ్యమంత్రి ఎన్నిక, మంత్రివర్గ ఏర్పాటు, స్పీకర్ తదితర కీలక పదవుల పంపిణీ తర్వాత అసలు కథ మొదలవుతుంది. కీలక నేతలకు అవకాశం రాకపోతే తెరవెనుక మంత్రాంగం మొదలు చేస్తారనటంలో సందేహం లేదు. గోవా, మధ్యప్రదేశ్, మిజోరం, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలు గెలిచినా నిలకడగా ప్రభుత్వాన్ని కొనసాగించలేకపోయాయి. ఆయా రాష్ట్రాల్లో బిజెపి చక్రం తిప్పి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అదే రీతిలో తెలంగాణలో కూడా జరగవచ్చు.

విపక్షంలోని ఎమ్మెల్యేలను కొందరిని తీసుకొని 70 మందికి కాంగ్రెస్ చేరుకోపోతే ఎప్పటికీ టెన్షన్ ఉంటుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికల సమయంలో మొదట కాంగ్రెస్ లో చేరిన వెంకట్రావును ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ లోకి తీసుకెళ్లారని…స్వతహాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా పేరున్న తెల్లం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీనిపై గులాబీ నాయకత్వం అంతగా పట్టించుకోకపోవచ్చు. పార్టీ ఫిరాయింపుపై ఫిర్యాదు చేసినా.. గతంలో వారు చేసినట్టుగానే ఏ చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ అదే పద్దతి అనుసరించవచ్చు.

భద్రాచలంలో గెలిచి గంట కూడా కాలేదు కండువా మార్చేందుకు సిద్దమైన భద్రాచలం (BRS) MLA తెల్లం వెంకట్రావు

మొన్నటి ఫలితాల లోగుట్టు విశ్లేషణ చేస్తే…ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎత్తుగడలు వేయకపోవచ్చు. కాలక్రమంలో పార్టీ వైఖరి మారినా ఆశ్చర్య పోనక్కరలేదు. బీఆర్ఎస్ కు బిజెపి సహకరిస్తే కాంగ్రెస్ ను ఆగం చేయటానికి ఎప్పటికీ అవకాశాలు ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు బిజెపి, బీఆర్ఎస్ లు మౌన వ్రతమే పాటిస్తాయని అనిపిస్తోంది. బిజెపికి ఎంపి స్థానాలు ముఖ్యం కనుక ఇప్పుడు టార్గెట్ ఢిల్లీ. ఆ తర్వాత ఎం జరుగుతుందనేది చూడాలి.

కారు గుర్తుమీద గెలిచిన ఎల్.బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పూర్వం కాంగ్రెస్ నేతలే కనుక వారు వెళ్ళటానికి అడ్డంకులు ఉండకపోవచ్చు. వారు వెళతారా లేదా అనేది ఇప్పుడే చెప్పేటట్టుగా లేదు.

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బిజెపి నుంచి గెలిచినా గతంలో కాంగ్రెస్ లో చురుకుగా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగక బిజెపిలో చేరిన మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. బిజెపిలో సిద్దాంతాల రాద్దాంతం పేరుతో రాష్ట్ర నాయకుల పోరు మొదలైతే నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వివేక్ వెంకటస్వామిల ఉదంతాలే  ఇందుకు ఉదాహరణ.

కాంగ్రెస్ నేపథ్యం ఉన్న ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను ఆకర్షిస్తే కాంగ్రెస్ భవిష్యత్తుకు డోకాలేదు. లేదంటే దినదిన గండంగానే ప్రభుత్వం కొనసాగించాల్సి వస్తుంది. రాష్ట్రంలో నేతలు పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. ఢిల్లీ నేతలు  మాత్రం ప్రభుత్వాన్ని సుస్థిరం చేయటం ఎట్లా అని సమాలోచనలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్