Sunday, January 19, 2025
HomeTrending Newsఆర్మీలో తెలంగాణ రెజిమెంట్ కు డిమాండ్

ఆర్మీలో తెలంగాణ రెజిమెంట్ కు డిమాండ్

తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. తెలంగాణకు ఇండియన్ ఆర్మీ ఇంఫ్యాన్ట్రీ రెజిమెంట్ ఏర్పాటు ఆవశ్యకతను వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమై ఇండియన్ ఆర్మీ కొత్తగా మూడు బెటాలియన్స్ ను ఏర్పాటు చేయనున్న విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పేరిట ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరారు.

గతంలో హైదరాబాద్ పేరిట 19 వ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ఉండేదని, మొదటి, రెండో ప్రపంచ యుద్దాలలో హైదరాబాద్ ఆర్మీ పాలుపంచుకుందని ఆయన ఆ లేఖలో తెలిపారు. లష్కర్ హైదరాబాద్ రెజిమెంట్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, పర్షియా, మలయా, సింగపూర్, బర్మా యుద్దాలలో పాల్గొందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్మీ రెజిమెంట్ లో తెలంగాణ ప్రాంతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉందని, దీని వల్ల అనేక అంశాలలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించడంలో,  యుద్ధ రంగంలో అపారమైన సేవలు అందించిన చరిత్ర ఉందని తెలిపారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, ఎకో సిస్టం కలిగి ఉందని వినోద్ కుమార్ వివరించారు. ఇటీవల ఇండియన్ ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనస్ఫూర్తిగా స్పందించారని ఆయన అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలు, కులాల పేరిట ఆర్మీ రెజిమెంట్ లు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్, సిఖ్, డోగ్రా రెజిమెంట్లు ఉన్నాయని, హర్యానా లో జాట్ రెజిమెంట్, జమ్మూకాశ్మీర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్, రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్లు ఉన్నాయని తెలిపారు. రాజస్థాన్ లో రాజ్ రైఫిల్స్, రాజపుత్, జాట్ రెజిమెంట్లు, బీహార్ లో బీహార్ రెజిమెంట్, మహారాష్ట్ర లో మరాఠా, మహార్ రెజిమెంట్లు, అస్సాం లో అస్సాం, నాగా రెజిమెంట్లు ఉన్నాయని తెలిపారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కలిపి మద్రాస్ రెజిమెంట్ మాత్రమే ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పేరిట ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖలో కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్