Thursday, March 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచరిత్ర తిరగని మలుపులు

చరిత్ర తిరగని మలుపులు

చరిత్ర దానికదిగా నిర్మాణం కాదు. ఎవరో ఒకరు నిర్మించాలి. కొందరు చరిత్రలో నిలిచిపోతారు. కొందరు చరిత్రలో కలిసిపోతారు. కాలం అన్నిటికీ మౌన సాక్షి.

Air India returns to Tatas

68 ఏళ్ల కిందట ఎయిర్ ఇండియా టాటాలది. భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఎయిర్ ఇండియా తిరిగి తిరిగి టాటాల చేతికే వచ్చింది.
Tata is not always good bye;
it’s home coming
అంటూ ఇంగ్లీషు మీడియా చమత్కారమయిన విరుపులతో హెడ్డింగులు పెట్టింది.

కేంద్ర ప్రభుత్వ ఆస్తులను దశలవారీ అమ్మేసే మానిటైజేషన్ పథకంలో భాగంగా ఎయిర్ ఇండియాను టాటా కొనుక్కుంది. మానిటైజేషన్ ను బలంగా వ్యతిరేకించేవారు కూడా ఎయిర్ ఇండియా టాటాల పరం కావడాన్ని మాత్రం అంతే బలంగా వ్యతిరేకించలేకపోతున్నారు.

ఒకప్పుడు టాటాలదే కాబట్టి…మళ్లీ వారి చేతిలోకే వెళ్లిందిలే అని అనుకుంటూ ఉండవచ్చు. అంబానీ, ఆదానీలతో పోలిస్తే టాటాల చేతిలోకి వెళ్లడమే శ్రేయస్కరమని సమాధానపడుతూ ఉండి ఉండవచ్చు. టాటాలకున్న విశ్వసనీయత కారణమై ఉండి ఉండవచ్చు. నిజంగా ఎయిర్ ఇండియాకు మహర్దశ రావాలనే మనం కూడా కోరుకుందాం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం ఏడాది పొడుగునా చేసుకుంటున్నాం. బి ఎస్ ఎన్ ఎల్, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, జాతీయ రహదారులు…ఇలా ఒకటొకటి ప్రయివేటు చేతుల్లోకి వెళ్లడం దేశానికి మంచిదా? అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల స్ఫూర్తి నిలబడుతుందా? చివరకు దేశాన్ని రెండు మూడు బడా కంపెనీలే శాసిస్తాయా? అని వినిపిస్తున్న పరి పరి ప్రశ్నలను మరో సందర్భంలో చర్చించుకుందాం.

భారత పారిశ్రామిక రంగ మేరునగధీరుడు జె ఆర్ డి టాటా నెహ్రూ విధానాల గురించి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన ఒక వీడియో ఇప్పుడు రైట్ వింగ్ గ్రూపుల్లో తెగ వైరల్ గా తిరుగుతోంది. ఆ ఇంటర్వ్యూ లింక్ ఇది.

https://www.facebook.com/NationWithNaMo2019/videos/jrd-tata-criticises-nehrus-blind-socialism-in-newly-surfaced-video/3201316593255643/

ఇందులో ఆయన చెప్పిన విషయ సారమిది.
“నెహ్రూ సామ్యవాద విధానాలు ఆచరణలో ఉపయోగపడవు. పరిశ్రమల జాతీయీకరణ వల్ల ప్రయోజనం ఉండదు. నెహ్రూ నన్ను ఆదరించేవాడు. నాతో ప్రేమగా మాట్లాడేవాడు. అప్పుడప్పుడు భోజనానికి సాదరంగా ఆహ్వానించేవాడు. మీ ఆర్థిక విధానాలు, సామ్యవాద సిద్ధాంతం మీద పునస్సమీక్షించుకోండి…అని మొహమాటం లేకుండా చెప్పడానికి ప్రయత్నిస్తే…సరిగ్గా ఈ విషయాలు నేను చెబుతున్నప్పుడు…ఏమీ విననట్లుగా కిటికీలోకి చూస్తూ ఉండిపోయేవాడు.ఇందిరాగాంధీ అలా కాదు. తనకు వ్యతిరేకమయిన విషయాలు చెప్పినా వినేది. అందులో ఒక పాయింట్ తీసుకుని స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేది. భారత తొలి ప్రధానిగా నెహ్రూ కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యుంటే బాగుండేది. నెహ్రూ పరిశ్రమల జాతీయీకరణ, ఆర్థిక విధానాలు కాలపరీక్షలో నిలబడవు అని ఆయనకే చెప్పాను”

ఇప్పుడు జె ఆర్ డి టాటా ఉండి ఉంటే ఏమనేవాడో కానీ…చరిత్ర తిరగని కొన్ని మలుపుల మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

సాధారణంగా టాటాలు మిగతావారిలా మాట తూలరు. ఆచి తూచి మాట్లాడతారు. టాటాలది ఒక విశిష్టమయిన సంప్రదాయం. వారసత్వం.

జె ఆర్ డి టాటా ఇంటర్వ్యూ చూస్తుంటే ప్రజాస్వామికవాదుల ఒళ్లు పులకించాలి. తొలి ప్రధానితో ముఖా ముఖి మీ విధానాలు బాగాలేవు; మార్చుకోండి…అని చెప్పడం…ఆ ప్రధాని వినడం…ఇంకో ప్రధాని ఉక్కు మహిళ విధానాల్లో లోపాలను ఆమెకే చెప్పడం…ఆమె వినడం…ఇప్పటి పరిస్థితుల్లో ఊహాతీతం.

ఫర్ సపోజ్…
ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త ప్రధాని మోడీతో భోంచేస్తూ…మీ నగదు రద్దు అనేది ఏదయితో ఉందో…అదేమంత మంచిది కాదు…అని చెప్పగలడా? చెప్పి బతికి బట్టగట్టి బలుసాకయినా తినగలడా? మొహం మీద కాదు…సోషల్ మీడియాలో అనామక పోస్టులు పెట్టినా…
రేచులవలెను…
తాచులవలెను…
సి బి ఐ
ఈ డి
ఐ టీ
తాళ్లు తెంచుకుని మీద పడవా?

అంతిమ నిర్ణయం ఎప్పుడయినా రాజుదే. కానీ భిన్నవాదనలు వినడం రాజధర్మం.

నిర్మొహమాటంగా ప్రధానులకు తన అభిప్రాయం చెప్పినందుకు టాటాను, విన్నందుకు నెహ్రూ, ఇందిరలను అభినందించాలి.

ఇప్పుడిలాంటివి విన్నారా?
కన్నారా?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

రామ రాజ్యం సంభవించే కాలమా ఇది?

Also Read:

అదానీ రోడ్ లు…అంబాని స్టేషన్లు

Also Read:

ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్