Alluri: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జూన్ 27వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ జరగనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు యువజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా అన్ని జిల్లాల్లో విద్యార్దినీ విద్యార్ధులకు సంగీత విభావరి, నాటికలు, దేశభక్తి గేయాలాపన, ఊరేగింపులు,సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, యోగా, ఫొటోగ్యాలరీ, పెయింటింగ్, వ్యాస రచన, రంగోలి పోటీలు, స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్ర, ఆయన జీవిత విశేషాలపై ప్రత్యేక ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుండి మాతృభుమిని కాపాడేందుకు అల్లూరి సాగించిన పోరాట స్పూర్తిని మననం చేసుకునేందుకు వీలుగా అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించిన విషయాన్ని రజత్ భార్గవ సర్క్యులర్ లో ప్రస్తావించారు.
1897 జూలై 4న జన్మించిన అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ళ చిన్నవయస్సులోనే అనగా 1924 మే 7న మరణించారు.