Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఓడి గెలిస్తే మరింత మధురం

ఓడి గెలిస్తే మరింత మధురం

Civils-Sportiveness:  మీడియా నిండా సివిల్ సర్వీసెస్ పరీక్షా టాపర్ల గురించిన కథనాలే. విజేతలకు శుభాకాంక్షలు. దాదాపు 11లక్షల మంది అప్లై చేసి, 5-6 లక్షల మంది రాసిన పరీక్షలో 1200 మంది ఇంటర్వ్యూకెళ్తే  685  మంది సెలెక్ట్ అయ్యారు. ప్రపంచంలో ఇంత ఫిల్టర్ చేసే పరీక్ష మరొకటి లేదంటారు. విజేతలు చాల గర్వ పడాల్సిన, సంతోష పడాల్సిన ఫలితం. అభినందనలు.

అయితే మన సమాజం విజయాన్ని మాత్రమే గుర్తిస్తుంది. సెలెబ్రేట్ చేస్తుంది. దానికి మాత్రమే ఒక పేజీ ఉంటుంది. గెలుపు,గెలుపు కోసం పరుగు మాత్రమే గొప్పదనంగా, గుర్తించదగినదిగా; తక్కినదంతా తక్కువగా మన మనస్సుల్లో లోతుగా చిన్నప్పటి నుండి ముద్రవేశారు. ఇక దానికి ప్రోద్బలం ఇచ్చే కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

Enjoy Success

ఓటమి గురించి ఎవరూ మాట్లాడరు. ‘ఓడినవారి’గా చెప్పబడే వారూ మాట్లాడలేరు. ఎవరి ఓటమిని వారే మోస్తారు మౌనంగా…ఎంతటి భారమైనా. కుంగి కూలేవాళ్ళూ రాలేవాళ్ళూ కూడా ఉంటారు. అసలు ఓటమిని భారం చేసిందే మన సమాజం, దాని దృష్టికోణం. అయితే ‘ఓడిన వారి’ గురించి ఎందుకు మాట్లాడాలి అనవచ్చు. ఎందుకంటే, ఓటమి కంటే వారి పోరాటం చెప్పుకోదగినది. ఓటమికైనా పోరాటమే- గెలుపుకైనా పోరాటమే నాంది. గెలుపు గొప్పదనాన్ని తియ్యదనాన్ని పొగడాలి. స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రచారం చెయ్యాలి. అలాగని ఓటమిని తక్కువ చెయ్యలేం. “It’s the sides of the mountain which sustain life, not the top Here’s where things grow …అలాగే… “But of course, without the top you can’t have any sides. It’s the top that defines the sides.” (Robert. M. Pirsig). గెలుపు ఒక ఫలితం మాత్రమే. పోరాటంతో వచ్చే ఫలితం. ఫలితం రాకపోయినా పోరాటమూ పోరాటమే.

ఓ తెలిసిన కుర్రాడి వాట్సాప్ స్టేటస్ లో  “నా శాయశక్తులా ప్రయత్నించాను. సెలెక్ట్ అవలేదు. అయినా ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఎన్నో పరిచయాలు. ఎన్నో జ్ఞాపకాలు. నేను పూర్తి బాధ్యత వహిస్తున్నా. మరింత బలంగా నన్ను తీర్చి దిద్దుకుంటా. జీవితపు నవ్వుల ప్రయాణం ఒక పరీక్షతో ఆగకూడదు.” అని చూశా. స్టేటస్ లో ఇలాంటి మెసేజ్ సాహసమే. అదే సరైన దృక్పథం. హాట్సాఫ్ టు దిస్ వాట్సాప్ స్టేటస్.

Enjoy Success

గెలుపుకి ఒక సందర్భం ఉంటుంది. ఒక సన్నివేశం ఉంటుంది. పరిమితి ఉంటుంది. ఢిల్లీ లోని శ్రీరాం కాలేజి ఆఫ్ కామర్స్ స్టూడెంట్స్ తో సుందర్ పిచ్చా-పాటీ లో ఎవరో కొంటె ప్రశ్న వేశారు. “ఇంటర్మీడియేట్ లో మీరెన్ని మార్కులు సాధించారు” అని. శ్రీరాం కాలేజిలో చేరాలంటే 99-100 మధ్యే ఉండాలి. సుందర్ పిచాయ్ సుందరంగా నవ్వి “శ్రీరాం కాలేజిలో చేరడానికి తగినన్ని రాలేదు” అని సమాధానం చెప్పాడు. చప్పట్లు. సుందర్ పిచాయ్ విజేతా … ఓడిన వాడా..?  శ్రీరాం కాలేజిలో చేరే విషయంలో అయితే, సుందర్ పిచాయ్ ఓడిన వాడే అని ఎవరైనా అంటారా.

64 టెన్నిస్ సింగల్స్ టైటిల్స్… అందులో 14 గ్రాండ్ స్లాం టైటిల్స్ తో 286 వారాలు నెంబర్ వన్ గా అజేయంగా నిలిచిన పీట్ సంప్రాస్ తన కెరీర్ లో ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం ఒక్కసారీ గెలవలేకపోయాడు… సరికదా క్వార్టర్ ఫైనల్స్ కూడా దాటలేక పోయాడు. గెలుపుకి ఓ సందర్భం ఉంటుంది. ఓటమికీ ఓ సందర్భమే ఉంటుంది. ఓటమి శాశ్వతం కాదు. మరలా పోరాటం చేయకపోతే తప్ప.

గెలిచిన వాడికీ జీవితం సుఖవంతమేమీ కాదు. మరో పర్వతారోహణే. మరో పోరాటం చేయకపోతే, గెలుపూ ఒంటరిగానే మిగిలి పోతుంది. పోరాటమే ప్రధానం. అందుకే కొండ ఎక్కేటప్పుడు కొండ చెక్కిళ్ళ అందాన్నీ, పచ్చని చెట్లనూ, చేతికందే మబ్బుల్నీ, సెలయేళ్ళనూ అనుభవించాలి.  ఇరుకైన కొండ కొమ్ము మీదికి కొద్ది మందే చేరతారు. అక్కడ ఒంటరితనం ఉంటుది. అక్కడికి చేరినవారూ కొండ ఎక్కేటప్పుడు మూటగట్టుకున్న అనుభవాల్నే నెమరు వేసుకుంటారు. మరో కొండ ఎక్కేందుకు స్ఫూర్తి పొందుతారు.

ఇది చాల హై ప్రొఫైల్ పరీక్ష. గెలిస్తే సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం తో పాటు హోదా కూడా. ఆటువంటప్పుడు అహర్నిశలూ కష్టపడి ఫలితం దక్కకపోతే ఆ బాధని కొన్ని కొటేషన్స్ తో మాన్పలేం. దేశం మొత్తం ఎదురుచూసే వరల్డ్ కప్ లో ఒక్క రన్ తో ఓడిన జట్టు బాధ ఎలా ఉంటుంది. అయితే, అది జట్టు ఓటమి. మరి ఒకరే ఆడే స్పోర్ట్స్ లో అదీ అంతర్జాతీయ స్థాయి పోటాపోటీలో ఓడినవారు ఓటమిని ఎలా చూస్తారు. మళ్ళీ ఎలా నిలబడతారు అనేది ఓ పెద్ద సబ్జెక్ట్. స్పోర్ట్స్ రిసెర్చ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ లూ, కోచ్ లూ ఓటమిని ఎలా ఎదుర్కోవాలో, జీర్ణించుకోవాలో పలు సందర్భాల్లో చెప్పారు.

ఓటమి పట్ల బహు కొద్ది మంది తప్ప సాధారణంగా అందరిదీ ఎమోషనల్ రెస్పాన్సే ఉంటుంది. దీని వల్ల మనసు తేలిక పడవచ్చు. కానీ, ఓటమి తరువాత జరిగే సంఘర్షణలో శరీరమూ, మనసూ ఓటమి వల్ల నేర్చుకునే ప్రక్రియను ఎమోషనల్ రెస్పాన్స్ భంగ పరుస్తుంది. దానివల్ల దీర్ఘకాలిక నష్టమే అంటారు. అందుకే ఎమోషనల్ రెస్పాన్స్ కంటే అప్రైజల్ రెస్పాన్స్ మెరుగైనది అంటారు. ఎమోషనల్ రెస్పాన్స్ లో ఇతరుల మీద ఆధారపడటం, ఇతరులను తప్పు పట్టడమూ, తనను తాను సముదాయించుకునే ప్రక్రియలో ఓవర్ మోటివేషన్ అవడమూ ఉంటాయి.

అప్రైజల్ రెస్పాన్స్ లో తప్పెక్కడ జరిగింది, భవిష్యత్ ఎలా మలచుకోవాలి, శక్తి యుక్తుల మీద సరైన అవగాహన, ఆశావహమైన భావన, ఓటమి కూడా ఒక సందర్భమే అనే స్పృహ కలిగి ఉండటమూ, అతి కాకుండా తగినంత ఆత్మ విశ్వాసం కలిగి ఉండటం లాంటివి వస్తాయి. అలాగే కొంత మంది అవాయిడెన్స్ రెస్పాన్స్ చూపిస్తారు. ఇది మంచిది కాదు. దీనివల్ల డిప్రెషన్ లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరు సైకాలజిస్ట్ లు చెప్పేది మరో ముఖమైన సూత్రం తన పట్ల తాను దయ కలిగి ఉండటం… self-compassion. ఓటమి సందర్భంలో సెల్ఫ్ క్రిటిసిజం కూడా పరిమితులు దాటకూడదు.

2019, దోహాలో వరల్డ్ ఛాంపియన్స్ విమెన్స్ పోల్ వాల్ట్ జరుగుతోంది. స్వీడన్ కి చెందిన 28 ఏళ్ళ అంజేలికా బెంగ్ట్సన్ 2015 లో తను సాధించిన స్వంత రికార్డ్ 4.7 మీటర్ల తో ఈ పోటీలో పాల్గొంటోంది. ఈ పోటీలో 4.5 మీ. మొదటి అటెంప్ట్ కే దాటేసింది. 4.7 మీ. కి ప్రయత్నిస్తోంది. మొదటి అటెంప్ట్ ఫౌల్. రెండో అటెంప్ట్ ఫౌల్. మూడో అటెంప్ట్ కి క్లియర్ చేసింది. ఇక 4.8 మీ” కి ప్రయత్నించింది. మొదటి అటెంప్ట్ ఫౌల్. రెండో అటెంప్ట్ కి ఊహించని పరిణామం. తను జంప్ చేస్తూ గాలిలోకి లేవగానే వాడిన పోల్ పెళ్లున విరిగి రెండు ముక్కలై పోయింది. ఒక్క సెకన్ స్టేడియం అంతా నిశ్శబ్దం. కింద పడ్డ ఆంజేలికా తేరుకుంది. లేచి స్టేడియం వైపు హుషారుగా చేతులూపింది. తన మొహంలో ఆ సంఘటన తాలూకూ ఏ మాత్రం ఆందోళన లేదు.  పక్క అథ్లెట్ పోల్ తీసుకుని మూడవ అటెంప్ట్ కి అవలీలగా 4.8 మీ దూకి తన రికార్డ్ ని తనే మెరుగు పరచుకుంది. ఓటమి అంచునుండి గెలుపుని లాక్కుంది.

Enjoy Success

ఈ ఉదాహరణ ఓటమి అంచున ఉన్నప్పుడు , ఓటమి చవి చూసినపుడు ఉండాల్సిన మానసిక దారుడ్యం, ఫోకస్, అసలేమీ జరగలేదు అని జరగాల్సిన దాని మీద ధ్యాస, అన్నిటికీ మించి ఇవన్నీ చిరునవ్వుతో చేయడం లాంటి ఎన్నో పాఠాలను చెప్తుంది. సైకాలజీ స్టడీస్ లో చెప్పే ఇంపాక్ట్ బయాస్ అనేది స్పోర్ట్స్ పర్సన్స్ కి ఉండకూడదు అంటారు. అంటే, ఒక సంఘటన ఉదాహరణకి గోల్ మిస్ చేయడం లాంటి దాని ఫలితం  తీవ్రత, అది ఎంతకాలం ప్రభావం చూపుతుంది అనే వాటి మీద మనసు పరి పరి విధాలు అంచనాలు వేస్తుంది. నిజానికి ఆ అంచనాలు నిజం కాక పోవడానికే అవకాశాలు ఎక్కువ. కానీ అలాంటి అంచనాల వల్ల స్పోర్ట్స్ పర్సన్ ఆట తీరు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దానిని కంట్రోల్ చేయాలి అంటారు. చిరునవ్వుతో ఆంజేలికా చేసింది అదే. మనం చెప్పుకున్నట్లు ఓటమికి ఒక సందర్భమే ఉంటుంది. దానిని చిలువలు పలువలుగా వర్ణించుకోవడం అనవసరం.

ఏ గెలుపైనా పోరాటం తరువాతే. అయితే,  ప్రయత్నలోపం లేని పోరాటం ఉండాలి. ఓడి గెలిస్తే మరింత తియ్యన. ఓడినా… ఇంపాక్ట్ బయాస్ ఉండకూడదు. పోరాటాన్ని వదలకూడదు

నేల తడపని వానేందుకు
నిన్ను తోలచని ప్రశ్నెందుకు
ఓడి గెలవని పోరెందుకు
ఊపిరవ్వని గురి ఎందుకు

– అంతర్లోచనం.

Enjoy Success

చివరిగా ఫిలసాఫికల్ గా ఆలోచించాలంటే, భుజంగరాయ శర్మ రాసిన రంగుల రాట్నం లోని కలిమి మిగులదూ లేమి మిగలదూ అనే పాట లోని నాలుగు లైన్లు చాలు (సినిమాల్లో ఆయన రాసిన ఒకే ఒక్క పాట ఇది )

కోరిక ఒకటి జనించు
తీరక ఎడద తపించు
కోరనిదేదో వచ్చు
శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో ఏది వరమ్మో
తెలిసీ తెలియక అలమటించుటే
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగుల రాట్నము

-విప్పగుంట రామ మనోహర

Also Read :

బిగ్ వీల్ గర్ల్ … యోగితా

RELATED ARTICLES

Most Popular

న్యూస్