Sunday, January 19, 2025
HomeTrending Newsజమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర హోదా - ప్రధాని భరోసా

జమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర హోదా – ప్రధాని భరోసా

లోక్ సభ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ ప్రజలకు సరికొత్త హామీ ఇచ్చారు. కాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా దక్కుతుందని… అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని ప్రధాని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదంపూర్‌ లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోడి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..370 ఆర్టికల్ రద్దు చేసినపుడు విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడ్డారు. కాశ్మీరీలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారన్నారు. జమ్ము కశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇప్పటి వరకూ రాష్ట్రంలో వచ్చిన మార్పులు కేవలం ఆరంభం మాత్రమే అని జమ్ముకశ్మీర్‌ను అద్బుత రాష్ట్రంగా మలిచే పనిలో బిజీగా ఉన్నానని ప్రధాని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం ఎంతో దూరంలో లేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా దక్కుతుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇక్కడి ప్రజలు ముఖాముఖి మాట్లాడొచ్చని, మీ సమస్యలను వారితో పంచుకోవచ్చని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ వ్యాఖ్యలతో లోయలో రాజకీయ పరిణామాలు మరే సూచనలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌లో లోక్‌సభ స్థానాలు అనంతనాగ్-రాజౌరీ, బారాముల్లా, శ్రీనగర్ ఉండగా జమ్మూలో ఉదంపూర్, జమ్మూ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. జమ్ములోని రెండు స్థానాల్లో 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన బిజెపి హట్రిక్ దిశగా ప్రచారం నిర్వహిస్తోంది.

జమ్మూతో పాటు ఈ దఫా కాశ్మీర్ లోయలో కూడా పాగా వేయాలని బిజెపి పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటికే అనంతనాగ్-రాజోరి లోక్ సభ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కు మద్దతు తెలిపింది. ఇక్కడ పిడిపి నుంచి మాజీ సిఎం మహబుబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సిట్టింగ్ ఎంపి హుస్సేన్ మసూది బరిలో ఉన్నారు.

ఇక బారాముల్లా నుంచి మరో మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడైన ఒమర్‌ అబ్దుల్లా 2009 తర్వాత తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా దక్కే వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన ప్రమాణం చేశారు.

నేషనల్ కాన్ఫరెన్స్ కంచుకోట శ్రీనగర్ నుంచి ఈ దఫా ఫరూక్ అబ్దుల్లా పోటీ చేయటం లేదు. వయోభారం దృష్ట్యా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రముఖ షియా నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహదీని ఫరూక్ అబ్దుల్లా స్థానంలో పోటీకి దించారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా జమ్మూ, ఉధంపూర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. మిగతా మూడింటిని మిత్రపక్షానికి కేటాయించింది.

ఇప్పటికే శాసనసభ నియోజకవర్గాల పునర్ విభజన జరిగింది. తాజాగా ప్రధాని మోడీ ప్రచారంతో కమలం శ్రేణులు సమరోత్సాహంతో ఉండగా విపక్షాల మధ్య ఐక్యత కొరవడింది. పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ విడిపోయి తలపడుతున్నాయి. ఇండియా కూటమిలో అనైక్యత బిజెపికి కలసివస్తుందని విశ్లేషణ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్