దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాకౌట్, సమ్మెలతో బ్రిటన్ అట్టుడుకుతోంది. విద్య, రవాణా, పౌర సేవలకు చెందిన 5 లక్షల మంది వర్కర్లు బుధవారం తమ పని ప్రదేశాల్లో వాకౌట్ చేశారు. బుధవారం లండన్‌లో ఉపాధ్యాయులు మార్చ్ నిర్వహించారు. సుమారు 4,75,000 మంది యూనియన్ సభ్యులు సమ్మెలో పాల్గొన్నారు. విక్టోరియా, కానన్ స్ట్రీట్, మెరిలేబోస్, లండన్ బ్రిడ్జ్ స్టేషన్లతో సహా లండన్‌లో ప్రధాన రైలు స్టేషన్లనీ పూర్తిగా మూసివేయబడ్డాయి. ఇంగ్లండ్, వేల్స్‌ల్లో 85 శాతం పాఠశాలలు మూసివేయబడినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ వెల్లడించింది. కాగా, ఈ సిబ్బందికి తోడుగా ఈ నెల 17 నుంచి నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తామని సరిహద్దు దళ అధికారులు తెలిపారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. తమ వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ పలు రంగాలకు చెందిన కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేపట్టారు. దాదాపు 5 లక్షల మందికి పైగా కార్మికులు బ్రిటన్ వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. విద్య, రవాణా, పౌరసేవలు, తదితర రంగాలకు చెందిన కార్మికులు వాకౌట్ చేయడంతో బ్రిటన్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. పాఠశాలల మూతపడ్డాయి.
రైలు సర్వీసులు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు ముక్తకంఠంతో నినదించారు. 2011 నవంబర్ 30న జరిగిన పెన్షనర్ల సమ్మె తర్వాత ఇంత పెద్దఎత్తున సమ్మె జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.