ఆఫ్రికా ఖండంలో ముఖ్యమైన దేశాల్లో ఒకటి, ఆఫ్రికాలో విస్తీర్ణంలో మూడో పెద్ద దేశం సూడాన్ అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో లక్షల కొద్ది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి వెళ్లిపోతున్నారు. భారీగా ఆస్తులు ధ్వంసమవుతుండటంతోపాటు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్‌ఎస్‌ఎఫ్) అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటివరకు 3 లక్షల 30 వేల మందికి పైగా ప్రజలు విదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరో లక్ష మందికిపైగా సరిహద్దులు దాటి పారిపోయారని తెలిపింది. మొత్తంగా 4 లక్షల 30 వేల మందికిపైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నది.
ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థి శిబిరం దక్షిణ సుడాన్ లోని దార్ఫూర్ లో ఉంది. యుఎన్ అధ్వర్యంలో నిర్వహించే దార్ఫూర్ క్యాంపు కు ఆల్లర్లు విస్తరిస్తే పెను సంక్షోభం ఏర్పడే ముప్పు పొంచి ఉంది. ఘర్షణలు ఇలాగే కొనసాగితే 8 లక్షల మందికిపైగా దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉందని ఐరాస శరణార్థుల సంస్థ అయిన యూఎన్‌హెచ్‌సీఆర్ (UNHCR) అంచనావేసింది. అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటం వల్ల ఇప్పటి వరకు 500 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
2021 వరకు దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అయితే దేశాన్ని మూడు దశాబ్దాలపాటు పాలించిన సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్సూడాన్ పై సైన్యం తిరుగుబాటు చేసింది. నాటి నుంచి అక్కడ సైనిక ప్రభుత్వమే పాలన సాగిస్తోంది. సైనిక జనరల్స్ సభ్యులుగా ఉండే కౌన్సిల్ అధికారం చెలాయిస్తోంది. సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ కనుసన్నలలో మిలిటరీ కౌన్సిల్ నడుస్తోంది. సూడాన్‌కు ఒకరకంగా ఆయనే దేశాధినేత.
అయితే సైన్యంలోని మరొక టాప్ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దాగలూ.. అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు జరుగుతున్నది. నూతన వ్యవస్థలో ఎవరు ఎవరికి విధేయులుగా ఉండాలనే అంశమే దీనికి కారణమైంది. అదికాస్తా అబ్దెల్‌పై తిరుగుబాటుకు దారితీసింది. దేశంలో అత్యంత బలమైనదిగా చెప్పే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) బలగాలకు మొహమ్మద్ హమ్దాన్ నాయకత్వం వహిస్తున్నారు.
మరోవైపు అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి (Operation Kaveri) చేపట్టింది. సముద్ర మార్గంద్వారా, సౌదీఅరేబియాలోని జడ్డా నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వస్థలాలకు తరలిస్తున్నది. తాజాగా 12వ ప్రత్యేక విమానం జడ్డా నుంచి భారత్‌కు బయల్దేరింది. అందులో 231 మంది ప్రయాణికులు ముంబైకి చేరుకోనున్నారు.