Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపట్టుదలతో ఉన్నత శిఖరాలకు.....

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు…..

Infosys Sudha: సుధా మూర్తి గురించి నేను మొదటిసారిగా విన్నది ప్రొఫెసర్ జయంత శ్రీ బాలకృష్ణన్ గారి ప్రసంగంలోనే. టిక్కెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసిన ఒక అమ్మాయిని సుధామూర్తి ఆదుకున్న ఉదంతాన్ని ఆమె చెప్పిన తీరు వింటుంటే ఆశ్చర్యమేసింది.  ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్ ట్రస్ట్ అధినేత్రి సుధామూర్తి గురించి ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది. నేను తెలుసుకున్నదే ఆలస్యమై ఉండొచ్చు. అలా తెలిసిన విషయాలు ఒకటి రెండైనా ఒక్కసారి మననం చేసుకోవాలనిపించే ఈ నాలుగు ముక్కలూ!

‘కౌన్ బనేగా కరోడ్ పతి” అంటూ హిందీలో నిర్వహించిన పదకొండో సీజన్లో సుధామూర్తి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నప్పుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆమె పాదాలకు నమస్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ జిల్లలో ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన ప్రప్రథమ మహిళ సుధామూర్తి అని అమితాబ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పుడు ఆమె జోక్యం చేసుకుని ఆ రోజుల్లో స్త్రీలు ఇంజనీరింగ్ చదవడానికి ఎంత కష్టపడ్డారో అని వివరించారు.

1968 లో ఆమె చదివితే ఇంజనీరింగే చదవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె తండ్రి వైద్యులు. ప్రొఫెసర్ కూడా. ఆమె తల్లి లెక్కల టీచర్. ఈమెకు అప్లయిడ్ సైన్సస్ అంటే ఆష్టం. కనుక ఆరు నూరైనా ఇంజినీరింగ్ చదవాలన్నదే ఆమె పట్టుదల.  అయితే ఆమె నిర్ణయాన్ని తెలిసి సుధామూర్తి బామ్మ విస్తుపోయారు. మనవరాలు ఇంజనీరింగ్ చదివితే అల్లుడెక్కడ దొరుకుతాడన్నది బామ్మ ఆందోళన. మరోవైపు తండ్రేమో ఎంబిబిఎస్ ఆమె చదివితే బాగుందని అనుకున్నారు. అమ్మేమో లెక్కల ప్రొఫెసర్ గా చూడాలనుకున్నారు. ప్రొఫెసరైతే అటు ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంటినీ చూసుకోవచ్చు అని అమ్మ అభిప్రాయం. ఇలా ఇంట్లో ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయంతో ఉన్న దశలో….  కానీ ఆమె మాత్రం చదివితే ఇంజినీరింగే అనే పట్టుదలతో ఉన్నారు. ఆమె ఇందుకోసం దరఖాస్తు పెట్టుకున్న ఆరు వందల మందిలో ఆమె మాత్రమే మహిళా విద్యార్థిని. మిగిలిన 599 అబ్బాయిలే.

ఆమె మంచి మార్కులతో దరఖాస్తు చేసుకోవడంతో కాలేజీ ప్రిన్సిపాల్ మరో దారి లేక సీటివ్వాల్సి వచ్చింది. అయితే కొన్ని నిబంధనలు విధించారు. తప్పనిసరిగా చీర మాత్రమే ధరించాలని. కాలేజీ క్యాంటీనుకి వెళ్ళకూడదని. ఈ రెండింటితో ఆమెకు ఏ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఆమెకు చీరలంటే మహా ఇష్టం. క్యాంటీన్లో ఆహారమూ ఆమెకు అస్సలు నచ్చలేదు కనుక అక్కడికి వెళ్ళకూడదన్న నిబంధనా ఆమెకేమీ తలనొప్పిగా మారలేదు. పరీక్షలలో ఆమె ప్రథమ స్థానం పొందడంతో అబ్బాయిలు తాముగానే వచ్చి మాట్లాడారు.

 Sudha

అయితే ఆమెకు ఒకే ఒక సమస్య తలెత్తింది. అదేంటంటే కాలేజీలో మహిళలకంటూ విడిగా టాయిలెట్ లేకపోవడం. ఒకవేళ దీనిని ఓ సమస్యగా గొంతెత్తితే మధ్యలోనే చదువు మానుకోవలసి వస్తుందేమోనని అనుకుని సర్దుకున్నారు. రోజూ ఇంటి దగ్గర ఉదయం ఏడు గంటలకు బయలుదేరే వారు. ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో కాలేజీ. ఆమె నడుచుకుంటూనే వెళ్ళేవారు. కాలేజీ పదకొండుకల్లా అయిపోతుంది. మళ్ళా రెండు కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకోవడం. కనుక కాలేజీలో మహిళలకంటూ విడిగా టాయిలెట్ లేదనే విషయాన్ని బయటకు చెప్పకుండా రోజులు నెట్టుకొచ్చారామె. ఈ దశలోనే ఆమె విద్యాలయాలలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఎంత అవసరమో గుర్తించారు. ఈ కారణంగానే ఇన్ఫోసిస్ ట్రస్ట్ అధినేత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పదహారు వేల టాయిలెట్లను ఏర్పాటు చేయించారామె.

ఆ రోజుల్లో స్త్రీలు ఇంజినీరింగ్ చదవడానికి ఎంత కష్టపడ్డారో చెప్పడానికి ఆమె పయనం ఓ ఉదాహరణ. అది లేదు ఇది లేదు అని అనుకోకుండా ఉన్నదాంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చన్నది ఆమె హితవు. అంతేతప్ప ఇది లేదు అది లేదని నస పెడుతుంటే జీవితంమీద విసుగుపుడుతుందంటారు. ఆమె తన పిల్లలకెప్పుడూ ప్యాకెట్ మనీ ఇవ్వలేదు.

పిల్లల పట్ల అంతులేని ప్రేమ చూపించేది అమ్మ. అలాగే అతి సహనశీలి అమ్మే అని ఆమె చెప్పారు. తన పిల్లలకోసం ఎక్కువ శ్రద్ధ తీసుకుని కష్టపడేదీ అమ్మే అంటున్న ఆమె పిల్లలకు మొట్టమొదటగా భాషను నేర్పించేది తల్లేనని అమ్మ భాషే పిల్లల భాషగా మారుతుందంటారు.అందుకనే మనం మాట్లాడే భాషను మాతృభాష అని అంటామన్నారు.

ఎవరైనా ఆమెను మీరెంతైనా బెస్ట్ అని అంటే సుధామూర్తి నమ్మరు. పొంగిపోరు. ఆమెకు తెలుసు తనకన్నా ఎందరో ఉత్తములూ అత్యుత్తములూ ఉంటారని. అలాగే తననెవరైనా Worst అని ఎవరన్నా చెప్పినా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే తాను worst కాదన్నది తెలుసని, తానెవరన్నది, తానేమిటన్నది తనకు తెలుసునని ఆమె చెప్పారు. తన సహాయం పొందిన వాళ్ళు తనను బెస్ట్ best అంటారు…సాయం పొందని వాళ్ళు worst అంటారు…..అంతమాత్రాన తనేమిటో తనకు తెలుసుకదా అని చెప్పిన సుధామూర్తి మనసు ప్రకాశవంతంగా ఉండటం ముఖ్యమంటారు. తాను చేసే ఏ పనైనా చట్టం పరిధిలోనిదే కదాని, సమాజానికి ఉపయోగపడేటట్టు ఉందా లేదా అని జాగ్రత్త పడతానని అన్నారు.

 Sudha

పిల్లలతో కలిసి పుస్తకపఠనం చేయాలన్నది ఆమె అభిప్రాయం. అంతేతప్ప టీవీ ఆన్ చేసి నేను టీవీ చూస్తుంటాను నువ్వు చదువుకో అని పిల్లలను పట్టించుకోకపోవడం సరికాదని, ఇద్దరూ పుస్తకాలు చదవాలంటారామె. వినయవిధేయతలన్నవి ఎవరికైనా ప్రధానం…పెద్దలు వాటిని కలిగే ఉంటే పిల్లలకూ ఆ గుణమొస్తుందని, పెద్దలను చూసేగా పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. కనుక పిల్లల పెంపకంలో ఇంట్లోని పెద్దలు అందులోనూ ముఖ్యంగా తల్లి కీలక పాత్ర పోషించాల్సిందేనని సుధామూర్తి నిశ్చితాభిప్రాయం. ఇలాంటి మహిళలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. వారి సుగుణాల్లో ఒకటో రెండో అలవర్చుకున్నా చైతన్యవంతమైన సమాజాన్ని అతి త్వరలో స్థాపించవచ్చు.

– యామిజాల జగదీశ్

Also Read : ఆమె ఒక తులసి వనం

ఆమె ఒక తులసి వనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్