Saturday, November 23, 2024
HomeTrending Newsధనిక రాష్ట్రంలో ఆత్మహత్యలు - ఈటెల

ధనిక రాష్ట్రంలో ఆత్మహత్యలు – ఈటెల

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో టీచర్లు, విద్యా వాలంటీర్లు, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్లు జీతాలు రాక అత్యాహత్యలు చేసుకుంటున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.  చేసిన పనులకు డబ్బులు రాక కాంట్రాక్టర్స్, బిల్లులు రాక సర్పంచ్ లు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణ వెలిగిపోతుందని కెసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఈటెల విమర్శలు ఆయన మాటల్లోనే…

మధ్యాహ్న భోజనం వండిపెట్టే వారికి జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు. మిడ్ డే మీల్స్ పెట్టే కాంట్రాక్టర్స్ కి బిల్లులు ఇవ్వక నాణ్యతలేని వస్తువులు, పాడైన కూరగాయలు తెచ్చి పేట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. తమ పిల్లలు బాగా చదువుకుంటారు, ప్రయోజకులు అవుతారు అని పంపిస్తున్న తల్లిదండ్రులు ఏ రోజు ఏ వార్త వినాల్సివస్తుందో అని వాపోతున్నారు. భోజనంలో బొద్దింకలు, వానపాములు రావడం పేద పిల్లలమీద కెసిఆర్ కి ఉన్న శ్రద్ద కు నిదర్శనం. కెసిఆర్ మనుమన్ని ఒక్క రోజు సంక్షేమ స్కూల్స్ లో భోజనం చేసి, అక్కడే స్నానం చేసి, అక్కడే పడుకోమని అడిగా.. కెసిఆర్ మనుమడు ఏం తింటున్నారో పేద పిల్లలు కూడా అదే తింటున్నారు అని ప్రగల్భాలు పలికారు కదా ? చేయగలరా ?

ఇవన్నీ కెసిఆర్ నిర్లక్ష్య పరిపాలనకు ప్రత్యక్ష ఉదాహరణలు. వీటికి నైతిక బాధ్యత కెసిఆర్ నే వహించాలి. ఆత్మహత్యలు కావు అవి ప్రభుత్వ హత్యలు. ఇలాంటి తిరోగమనంలో ఉన్న కెసిఆర్ పాలనను ప్రోగ్రెసివ్ గా ఉంది అంటూ వామపక్ష పార్టీలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. ప్రజాసమస్యల మీద ప్రభుత్వాల మీద పోరాడాల్సిన కామ్రెడ్స్ వారితోనే అంటకాగితే ఏమనాలి? స్వప్రయోజనాలను పక్కన పెట్టీ పీడిత, బాధిత ప్రజల పక్షాన నిలబడాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను లేదంటే.. పాలకపక్షం పంచన చేరిన వామపక్షాలకు కెసిఆర్ తో పాటు చెంప చెళ్లుమనిపించడం ఖాయం.

5 నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న గెస్ట్ లెక్చరర్స్, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకు సీఎం కెసిఆర్ భాధ్యత వహించాలి అని ఈటల రాజేందర్ అన్నారు. 2013 సంవత్సరం నుండి అంటే గత 9 సంవత్సరాలుగా 405 జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్స్ అరకొర జీతానికి పని చేస్తున్నారు. ఆ జీతం కూడా నెల నెలా రావడం లేదు. ఈ సంవత్సరం జూన్ 15 నుండి వీరందరూ పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వీరిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక అత్యహత్యలు చేసుకుంటున్నారు.
గత సంవత్సరం ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోగా.. నాగర్ కర్నూల్ కి చెందిన అతిధి ఉపాద్యాయులు సుజాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యలకు సీఎం కెసిఆర్ భాధ్యత వహించాలి అని ఈటల రాజేందర్ అన్నారు. వారి బ్రతుకులు అడ్డామీద కూలిల కంటే అధ్వాన్నంగా మారింది అని అతిధి ఉపాద్యాయులు వాపోతున్నారు. నెల నెలా జీతాలు ఇవ్వకుంటే బ్రతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వారికి విద్యా శాఖ మంత్రి సమాధానం చెప్పాలి అని ఈటల రాజేందర్  డిమాండ్ చేశారు.
అతిధి ఉపాద్యాయులకు వెంటనే జీతాలు చెల్లించి 1654 కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పీరియడ్ విధానాన్ని తీసివేసి 12 నెలల కన్సాలిడేటెడ్ వేతనం ఇచ్చి వారి జీవితాలను కాపాడాలని ఈటల రాజేందర్ కోరారు.

కెసిఆర్ కేవలం రాజకీయాల మీద మాత్రమే శ్రద్ద పెట్టకుండా.. రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న ఉపాద్యాయులు, లెక్చరర్లు, VRAలు, VROలు, విద్యా వాలంటీర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, డైట్ కాంట్రాక్టర్స్ సమస్యలు కూడా పట్టించుకోవాలని, వెంటనే పరిష్కరించాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే బయటికి వచ్చి , సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చే కెసిఆర్ కి తగిన బుద్ది చెప్పాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read : మిషన్ కెసిఆర్ ఓటమి ఈటెల రాజేందర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్