Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Students-Suicides:
“అమ్మా నాన్నా! నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి.
మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు.
కళాశాలలో ప్రిన్సిపల్, కళాశాల ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.
కృష్ణారెడ్డి ,ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులకు తట్టుకోలేక పోయాను.
నేను ఉంటున్న హాస్టల్లో వీరు ముగ్గురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు.
వీరి వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
నన్ను వేధించిన ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకోండి.
అమ్మానాన్న లవ్ యు , మిస్ యూ ఫ్రెండ్స్”

-సాత్విక్

ఇది ఒక విద్యార్థి మరణ వాంగ్మూలం.

చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. ముందు వాక్యం ఎలా చదవాలో తెలియక…ముందు వాక్యంలో ఏముంటుందో అన్న ఆందోళన పెరుగుతుంది.

సవాలక్ష చైతన్య కాలేజీల్లో ఒకానొక చైతన్య కాలేజీలో ఆగిన విద్యార్థి ఊపిరికి అనువాదమిది. త్రీ ఇడియట్స్ లో అమీర్ ఖాన్ అన్నట్లు పేరుకు ఆత్మహత్య అయినా…హత్యగా చూడాల్సినది ఇది.

త్రీ ఇడియట్స్ కోణంలో-
హత్యలు కాకుండా ఆత్మహత్యలుగా మారిపోయినవి ఇలాంటివే ఎన్నో?

అమ్మా నాన్నలు కన్న కొడుకు సాత్విక్ ను క్షమించినా…క్షమించకపోయినా ఎదిగి చెట్టంత కావాల్సిన అతడి బంగారు ప్రాణం తిరిగిరాదు. అంతటి సాత్వికుడిని పోగొట్టుకున్న వారి గుండెకోతకు మాటలేమి సరిపోతాయి?

విద్యా పెను పరిశ్రమల్లో పెట్టే “టార్చర్” సాత్విక్ కోరుకున్నట్లు నిజంగా ఎప్పటికయినా పోతుందా?

చదువంటే బతుకు కదా!
చదువంటే చావుకొస్తోందా?

చచ్చినా…వెంటపడే చదువులు సాత్విక్ తో ఆగిపోతాయా?

అతను బతికి ఉండి మిసమిసలాడాల్సిన క్షణాలు ఇప్పుడు దిగులుపడుతున్నాయి.
అతను బతికి ఉండి ఏపుగా ఎదగాల్సిన జీవితం ఇప్పుడు కన్నీటి చుక్కగా మిగిలిపోయింది.

“చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!”

పోతన భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన మాట ఇది. తెలుగు సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇది. అయితే ఆదర్శానికి-ఆచరణకు; భక్తికి- భావనకు ఎప్పుడూ అంతరం ఉంటుంది. ఆరేళ్లకే ప్రహ్లాదుడికి అంత క్లారిటీ ఎలా వస్తుందని ఇప్పుడు మనం తలలు బాదుకుని ప్రయోజనం లేదు. గురువులు చదివించారు. ధర్మ అర్థ ముఖ్య శాస్త్రాలన్నీ చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే చదువులో మర్మమంతా చదివాను- అన్నాడు.

ఇప్పుడయితే ఆరేళ్లకే సకల శాస్త్రాలు చదివినవాడు దేశవ్యాప్తంగా నారాయణను తలదన్నేలా ర్యాంకుల చైతన్యం నింపుతూ దేశమంతా కోచింగ్ సెంటర్లు, కోళ్లఫారం కాలేజీలు పెట్టుకునేవాడు. లేదా ప్రహ్లాదుడిని బుట్టలో వేసుకుని నారాయణలో ట్యూటర్ గానో, చైతన్యలో లెక్కల టీచర్ గానో పెట్టుకుని ఒకటి ఒకటి ఒకటి; అర అర అర; పావు పావు పావు- అన్ని ర్యాంకులు మావే-
వేలకోట్లు మాకే;
ప్రహ్లాదుడితో కోచింగ్-
వద్దన్నా ర్యాంకింగ్ -అని ప్రకటనలు ఇచ్చుకునేవారు. అయినా ఆ యుగంలో ఐ ఐ టి లేదు కాబట్టి ప్రహ్లాదుడు సకల శాస్త్రాల్లో పాస్ అయ్యాడు. ఉండి ఉంటే జె ఇ ఈ దాటి ఉ ఊలకు, అడ్వాన్సు గుమ్మం తొక్కకుండానే అడ్వాన్సుగా పక్కకు తప్పుకునేవాడు.

ఒకటి మాత్రం ఆ యుగానికి- ఈ యుగానికి తేడాలేదు. కోచింగ్ ఇచ్చేవారు అప్పుడూ ఇప్పుడూ చండామార్కులవారే. మార్కులకోసం చండాలంగా హింస పెట్టేవారు, మార్కులను ప్రచండంగా రాబట్టేవారు, మార్కులు కాని అమార్కులను మార్కులుగా రాబట్టే చండ ప్రచండులు- అని వివిధ రకాలుగా చండామార్కుల మాటకు సమాసం సాధించవచ్చు. చెప్పడానికి వీలుకాని చండాలమయిన పద్ధతుల్లో మార్కులకోసమే చదువు కొనేవారు లేదా అమ్మేవారు అని వ్యుత్పత్తి చెప్పుకున్నా వ్యాకరణం పెద్దగా అభ్యంతరపెట్టకపోవచ్చు.

భారతదేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఏటా విద్యకు అయ్యే ఖర్చులో సున్నాలు లెక్కపెట్టడానికి ఇన్ఫినిటీ నంబర్లు కనుక్కున్న శ్రీనివాసరామానుజన్ దిగిరావాల్సిందే.

మనం చదవకూడని, చదివినా ప్రయోజనం లేని ఒక వార్త ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసుదాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అన్ని మౌలికమయిన విషయాలను చెబుతారట. వినడానికే మనకు చాలా విచిత్రంగా ఉంది కదా? స్వేచ్ఛగా, హాయిగా, ఇష్టంగా పిల్లలు ఎలా చదువుతారో ఫిన్లాండ్ ఎప్పుడో పసిగట్టింది. విద్యాబోధనలో ప్రయోగాలు చేసింది. పిల్లలకు బరువు తగ్గించింది. పిల్లల ఊహా శక్తికి రెక్కలు తొడిగింది. అద్భుతాలు సాధించింది. మిగతా ప్రపంచం అందుకోలేనంత ఎత్తుకు చేరింది.

చదువుల గొడ్ల చావిళ్ళలో మోతుబరి అయ్యవార్లు పశువులను బాదినట్లు విద్యార్థులను కొడుతున్నారని, మార్కుల కోసం దుర్మార్గమయిన హింస పెడుతున్నారని, బాగా మార్కులు రానివారు రాలేదని, వచ్చినవారు జీవంలేని మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటుంటే చివరికి మిగిలేదెవరు? వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన ఎన్ని కొంగొత్త విషయాలకు దిక్కేది? మొక్కేది? వారు బతికి ఉండి తుళ్లుతూ…గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం లేనివైపోతున్నాయి?

ప్రాపంచిక విషయాలను పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఫిన్లాండ్ ఎందుకు పెట్టిందో మనకెందుకు?
ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి ఫిన్లాండ్ ఎందుకంత ప్రాధాన్యమిస్తోందో మనకెందుకు?
బతుకులో ఎదురయ్యే ప్రతి సందర్భానికి ఒక విశాల తాత్విక భూమిక ఉందని…బతుకు ఒక నిత్య వసంతంగా ప్రవహించే వర్ణ శోభిత పూల రుతువు అని అడుగడుగునా తెలియజెప్పే ఫిన్లాండ్ పాఠం మనకెందుకు?
జీవితమంటే బతుకు పాదులో ఆశల నీరు పోసి…ప్రతి క్షణాన్ని ఆనందమయంగా జీవించడమనే ఫిన్లాండ్ పాఠశాల విద్య మనకెందుకు?
బెల్ మోగుతోంది…
కర్ర పట్టుకుని నారాయణ చైతన్యం పిలుస్తోంది.

పదండి..పోదాం…
చదువుల చీకటి గదుల్లోకి.
పదండి…పోదాం…
ర్యాంకుల అంకెలు రంకెలేసే గొడ్ల చావిట్లోకి.
పదండి…పోదాం…
అర్థం కాని శ్మశానాల చదువుల నిఘంటువుల్లోకి.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com