Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్IPL: సన్ రైజర్స్ బోణీ- పంజాబ్ పై గెలుపు

IPL: సన్ రైజర్స్ బోణీ- పంజాబ్ పై గెలుపు

ఐపీఎల్ ఈ సీజన్ లో రెండు వరుస ఓటములు ఎదుర్కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 144 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే సాధించింది. ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 74; కెప్టెన్ ఎడెన్ మార్ క్రమ్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్-13; మయాంక్ అగర్వాల్­­-21 పరుగులు చేసి ఔటయ్యారు.

పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.

ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరిగాడు. 22 పరుగులకు మూడు వికెట్లు (మాథ్యూ షార్ట్-1; జితేష్ శర్మ-4) కోల్పోయింది. అయితే పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మరోసారి తన సత్తా నిరూపించాడు. ఓవైపు సహచరులంతా పెవిలియన్ కు క్యూ కడుతున్నా ఓపిగ్గా క్రీజులో నిలదొక్కుకొని 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొమ్మిదో వికెట్ కు మొహిత్ రాథీతో కలిసి అజేయంగా 55 పరుగులు జోడించడం విశేషం కాగా…. వీటిలో 54 పరుగులు ధావన్ ఒక్కడే సాధించడం మరో విశేషం. జట్టులో ధావన్ మినహా శామ్ కర్రన్(22) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగాడు.

హైదరాబాద్ బౌలర్ మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో రాణించాడు. మార్కో జాన్సన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు; భువీ ఒక వికెట్ పడగొట్టారు.

అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్