IPL-2022: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్ లో సమిష్టిగా రాణించి చెన్నైను 154 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ(75); విలియమ్సన్ (32); రాహుల్ త్రిపాఠి (39-నాటౌట్) లు సత్తా చాటడంతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై 25 పరుగులకు తొలి వికెట్ (రాబిన్ ఊతప్ప-15); 36 వద్ద రెండో వికెట్ (రుతురాజ్ గైక్వాడ్-16) కోల్పోయింది. ఈదశలో అంబటి రాయుడు- మొయిన్ అలీ కలిసి మూడో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాయుడు 27; మొయిన్ అలీ-48 పరుగులు చేసి ఔటయ్యారు. శివం దూబే (3); ధోనీ (3) విఫలయ్యారు. కెప్టెన్ జడేజా 15 బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్సర్ తో 23 పరుగులు చేయడంతో చెన్నై20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు; భువనేశ్వర్, మార్కో జాన్సన్, మార్ క్రమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన హైదరాబాద్ తొలి వికెట్ కు 89 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ- తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు. అభిషేక్ 50 బంతుల్లో 5ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగులు చేసి ఔటయ్యాడు. త్రిపాఠి అద్భుతంగా రాణించి కేవలం 15 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు, 17.4 ఓవర్లలో హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైలో బ్రావో, ముఖేష్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.
అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : ఐపీఎల్: పంజాబ్ పై గుజరాత్ అద్భుత విజయం