ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకూ ఆయనకు ఈ ఉపశమనం ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 10న వాదనలు వింటామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈలోగా రౌస్ అవెన్యూ, ఢిల్లీ హైకోర్టుల్లో ఆయన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
అరెస్ట్ పిటిషన్ పై విచారణ ఆలస్యం అవుతున్నందున లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎన్నికలు పూర్తయ్యే వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించకూడదని, కేవలం ప్రచారానికే పరిమితం కావాలని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.