ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈడీ దాఖలు చేసిన కేసులో కవితకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం తీర్పు చెప్పింది.
కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఇప్పటికే రెండు కేసుల్లోనూ ఛార్జ్ షీట్ నమోదు చేశారని, ఐదు నెలలుగా ఈడి, నాలుగు నెలలు గా సీబిఐ రిమాండ్ లో కవిత ఉన్నారని, 493 సాక్షులను విచారించి, 50వేల పేజీలతో ఛార్జ్ షీట్ వేశారని, ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ఎలాంటి అవకాశం లేదని…. అందులోనూ ఆమె మాజీ ఎంపి అని, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారని వాదించారు. సౌత్ లాబీ, వందకోట్ల ముడుపులు అని చెప్పినా దర్యాప్తు సంస్థలు ఎలాంటి రికవరీ చేయలేదని ధర్మాసనం దృష్టికి టీసుకొచ్చారు. కవిత తండ్రి ముఖ్యమంత్రిగా, సోదరుడు మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు.విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఈడీ నోటీసు రాగానే ఫోన్లను, దానిలోని సమాచారాన్ని ధ్వంసం చేశారని, ఫోల్నాను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిమనుషులకు ఇచ్చారని, సాక్ష్యాలను తారుమారు చేశారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు వాదించారు. కవిత విచారణకు సహకరించలేదని, ఆమె ఫోన్లలో కేవలం పది రోజుల సమాచారం మాత్రమే ఉందన్నారు.
సిబిఐతో పాటు ఈడీ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ కవిత దాఖలు చేసినందున రెండు కేసుల్లోనూ బెయిల్ తీర్పు వర్తిస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు.
దాదాపు గంటన్నర పాటు జరిగిన వాదనల అనతరం బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసన నిర్ణయం తీసుకుంది. మార్చి 15న ఆమెను ఈడీ అదుపులోకి తీసుకుంది. దాదాపు 163 రోజులపాటు ఆమె జైలు జీవితం అనుభవించారు. ఈ సాయంత్రం ఆమె విడుదలయ్యే అవకాశం ఉంది.