Thursday, November 21, 2024
HomeTrending Newsసిఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

సిఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు  సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయండంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసినట్లుగా పలు పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ జనవరి 31న బీఆర్‌ఎస్‌ నేతలు జగదీశ్‌రెడ్డి, సత్వవతి రాథోడ్‌, మహ్మద్‌ అలీ, కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్థార్థ్‌ లూథ్రా, మేనకా గురుస్వామి, న్యాయవాదులు శ్రావణ్‌ కుమార్‌, ఎంఏ నజ్కీ, పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఆర్యమ సుందరం, సిద్థార్థ దవే, దామ శేషాద్రి నాయుడు, న్యాయవాది మోహిత్‌రావు హాజరయ్యారు. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై ఇద్దరు న్యాయమూర్తులు ఘాటుగా ప్రతిస్పందించారు.

రాజ్యాంగ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని,  న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లుగా అనిపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయి స్పందిస్తూ… ‘‘ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొందరి ఆలోచనల్లో భయాలు రేకెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము తీర్పులు ఇస్తున్నామా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘న్యాయమూర్తులుగా మేం ప్రమాణం చేస్తాం. మనస్సాక్షిగానే మా విధిని నిర్వర్తిస్తాం’’ అని స్పష్టం చేశారు. మరో న్యాయమూర్తి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ జోక్యం చేసుకొని… ‘‘ఇది ఒక సీఎం హోదాలో ఉన్న బాధ్యత గల వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలా? సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలని ప్రాథమిక కర్తవ్యం చెప్పలేదా? గౌరవం కలిగి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 2కు  ధర్మాసనం వాయిదా వేస్తూ విచారణ బదిలీ అంశాన్ని ప్రస్తుత స్థితిలో రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్