కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం అన్నది కేంద్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపింది. విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర స్పందిస్తూ.. తమ వద్ద సరిపోయినన్ని నిధులు లేవని కోర్టుకు తెలిపింది. కేంద్ర వాదనను అంగీకరించని కోర్టు మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇవ్వాలి అనేది కేంద్రమే నిర్ణయించి 6 వారాల్లో విధివిధానాలు తయారు చేయాలని సూచించింది. విపత్తులో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని రికమండేషన్ చేయడంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
కోవిడ్ తో మరణించిన వారికి డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, కోవిడ్ కారణంగానే మృతి చెందినట్లు దానిలో స్పష్టంగా పేర్కొనాలని న్యాయస్థానం ఆదేశించింది.