Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Cricket: సురేష్ రైనా గుడ్ బై !

Cricket: సురేష్ రైనా గుడ్ బై !

ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ఆటకు గుడ్ బై చెప్పాడు.  అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం  వెలువరించాడు. 2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్ కు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ ప్రకటించిన రోజే రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రైనా 2020లో  దుబాయ్ లో జరిగిన  ఐపీఎల్ టోర్నీకి అక్కడకు వెళ్లి కూడా  కోవిడ్ కారణంగా వెనుదిరిగి ఇండియాకు వచ్చేశాడు. 2021 ఐపీఎల్ లో 12 మ్యాచ్ లు ఆడి  కేవలం 160 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. 2022 సీజన్ కు రైనాను కొనసాగించడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి ప్రదర్శించలేదు. మిగిలిన జట్లు కూడా అతన్ని తీసుకోలేదు. దీనితో కొన్ని మ్యాచ్ లకు కామెంటేటర్ గా పనిచేశాడు.

సురేష్ రైనా తాను ఆడిన గత రెండు మూడు సీజన్లలో విఫలమైనా మొత్తంగా ఐపీఎల్ కెరీర్ లో అత్యుత్తమ ఆటగాడిగా, అద్భుత ఫీల్డర్ గా క్రికెట్ ప్రేమికుల మనసులు దోచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా అవతరించడంలో రైనా పాత్ర విస్మరించలేము.

తన కెరీర్ లో 18 టెస్ట్  మ్యాచ్ లు ఆడి 768;  226 వన్డే మ్యాచ్ లు ఆడి 5,615;  టి 20ల్లో 78 మ్యాచ్ లు ఆడి 1,605 పరుగులు చేశాడు.

ఐపీఎల్ లో 205 మ్యాచ్ లు ఆడి 5,528 పరుగులు చేశాడు.

ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ ల తర్వాతా 200 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

గత మూడు సీజన్లలో రెండింటిలో ఆడకపోయినా, 2019 లో అంతగా రాణించకపోయినా….. ఇప్పటికీ ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళలో నాలుగో స్థానంలో రైనా ఉన్నాడంటే అతని ప్రతిభను మనం అంచనా వేయవచ్చు.

“ఆటలో దేశానికి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం..  క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నా. బిసిసిఐ, యూపీ క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, రాజీవ్ శుక్లాలకు ధన్యవాదాలు. ఇప్పటి వరకూ ఆదరించిన క్రీడాభిమానులకు, నా సామర్ధ్యాలపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికికీ కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్