Sunday, January 19, 2025
HomeTrending Newsత్వరలోనే మిగులు విద్యుత్తు - సిఎం కెసిఆర్

త్వరలోనే మిగులు విద్యుత్తు – సిఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.  ముందుగా జాతీయ జెండా ఎగురవేసిన సిఎం ఆ తర్వాత వివిధ రంగాలకు చెందినా అత్యత్తమ అధికారులకు పతకాలు అందజేశారు. సిఎం కెసిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను  యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం  చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను.

ఈ సందర్భంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ  ప్రస్థానం లోని వెలుగు నీడల్నిమనందరం  వివేచించుకోవాలి.  మనం సాధించింది ఏమిటి ?  ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు  చేసుకోవాలి. ఒకవైపున  దేశం అనేక రంగాలలో కొంతమేరకు  పురోగతిని సాధించింది. అదేసమయంలో నేటికీ  చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉంది. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి” అని మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటనూ  ఇప్పటికీ మనం అన్వయించుకో వలసిన అవసరం ఉంది.

మహాత్మా గాంధీ నాయకత్వంలో, అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం  విజయం సాధించాం. స్వరాష్ట్రం సాధించుకున్న నాటినుంచి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా,  ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం  ముందుకు సాగుతున్నది.  అన్నిరంగాల అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నది.

రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించ గలుగుతున్నది. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్నిరంగాలలో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగాం. వాస్తవం కళ్ళముందే కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవం లో ఉన్నాయి. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను  శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

దీర్ఘ దృష్టి తో రూపొందిన ప్రణాళికతో, పటిష్టమైన ఆర్ధిక క్రమశిక్షణ తో పరిపాలన కొనసాగించటం వల్ల తెలంగాణ ఏడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో  సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2013 -2014 తెలంగాణ ఏర్పడిన నాడు  రాష్ట్ర స్థూల ఉత్పత్తి  4,51,580 కోట్ల రూపాయలు. కోవిడ్ ఉత్పాతం ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ  2020-2021 ఆర్ధిక సంవత్సరం లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9 లక్షల 80 వేల 407 కోట్ల రూపాయలు గా నమోదైంది.

అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 12 వేల 126 రూపాయలు  ఉండగా నేడు తెలంగాణా రాష్ట్ర  తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుంది. నేడు  మన దేశ తలసరి ఆదాయం 1 లక్షా 28 వేల 829 రూపాయలు గా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్నపెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్విస్తున్నాను.

    కరెంటు కష్టాలకు చరమగీతి పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కింది. టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను అంతగా బలోపేతం చేసింది. నేడు దేశంలో 24 గంటలూ అన్నిరంగాలకూ  నిరంతరాయంగా మేలైన విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటీ, రైతులందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి  ఏకైక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే. తెలంగాణ ఏర్పడిన నాడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,788 మెగావాట్స్ మాత్రమే.  తెలంగాణ ప్రభుత్వం చేసిన అపూర్వమైన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 16,425 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ పరిధిలో కేవలం 71 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మాత్రమే ఉత్పత్తయ్యేది.

ప్రస్తుతం మన రాష్ట్రం 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మన తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తొలినాళ్ళలో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం1356 యూనిట్లు ఉండేది. విద్యుత్ రంగంలో వచ్చిన అసాధారణ అభివృద్ధి వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ప్రస్తుతం 2012 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉంది.

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొట్ట మొదటి స్థానంలో నిలిచిందని సవినయంగా మనవి చేస్తున్నాను. మన నల్లగొండ జిల్లాలో, 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణ మౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా  అవతరిస్తుందని తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ.

ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో, అనేక విషయాలలో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా నిలచింది. వివిధ రాష్ట్రాల వారు మన విధానాలను  అనుసరించి, ఆచరించడానికి మనవద్దకు వస్తున్నారు. మన పథకాలను, మన కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. అనతికాలంలోనే నూతన రాష్ట్రం దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా మారిన అద్భుతాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది.

వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి

ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది. సాగునీరు అందక, కరెంటు లేక ,పంటలు పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక,  కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు ఆత్మహత్యలపాలై పోయారు. నిత్య విషాద ఘటనలతో తెలంగాణా తల్లడిల్లిపోయింది. సమైక్య పాలకుల వివక్ష, విద్రోహాల కారణంగా తెలంగాణ తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది. ఇవాళ దృశ్యం మారిపోయింది.  స్వరాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదయింది. ఒకప్పుడు తెలంగాణ  కరవు కాటకాలకు చిరునామాగా మారింది.

ప్రస్తుతం అదే తెలంగాణ  2020-21 వ్యవసాయ సంవత్సరంలో, మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మూడుకోట్ల నలభై లక్షల  టన్నుల  దిగుబడిని  సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీ.డీ.పీ లో 20 శాతం ఆదాయం  వ్యవసాయ రంగం సమకూరుస్తున్నది.  దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనమేముంటుంది.

తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాలకోసం కానీ, పేదలకు రేషన్ బియ్యం పంపిణీకోసం కానీ  ఎక్కడెక్కడి నుంచో,  పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతిఅయ్యేవి.  అవి తినడానికి కూడా పనికొచ్చేవి కాదు.  కానీ ఈ రోజు తెలంగాణ రైతన్నలు తెలంగాణకే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ “రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా” అవతరించింది.

మంత్రం వేస్తెనో, మాయచేస్తేనో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు సంభవించదని  నేను వేరే చెప్పనక్కరలేదు. అహర్నిశలూ చేసిన మేధోమథనం, సమర్థవంతమైన ప్రణాళికల పర్యవసానమే ఈ అపూర్వ అభివృద్ధి అని సవినయంగా మనవి చేస్తున్నాను. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు, వ్యవసాయ శాఖను పటిష్ట పరచటం, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు,  రైతుబంధు, రైతుబీమా పథకాలూ,  రైతువేదికలు, పొలాల దగ్గర కల్లాల నిర్మాణం, గిడ్డంగుల సౌకర్యం లో పెరుగుదల,  సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయం రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధైర్యాన్ని, భరోసాని రైతులకు అందించింది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కావాల్సిన బలమైన పునాదుల్ని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది.

ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించింది.

2013-14 లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే,  2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరిపంట సాగయింది. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణం లో పత్తి పంట సాగయింది. 31 లక్షల 60 వేల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది.  పత్తి సాగులో తెలంగాణా దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండవ  స్థానం లో నిలిచింది. దేశంలో తెలంగాణా పత్తికి  చాలా  నాణ్యమైనదనే పేరుంది కనుక  మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉండటం గమనార్హం.

గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలో రెండవ  స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించ గలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్