అటవీ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రేణుకా సింగ్ ప్రకటించారు. గిరిజనుల కోసం వైద్య సేవలను అందించే స్వచ్ఛంద సంస్థలకు అవసరమయ్యే మౌళిక సదుపాయాలను కేంద్రం సమకూరుస్తుందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి రేణుకా సింగ్ అధికారిక నివాసాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సందర్శించారు. గిరిజన ప్రాంతాల్లో విశాఖ శారదాపీఠం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
ఆదివాసీలకు కనీస వైద్య సేవలు అందడం లేదని స్వామీజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్రలో వైద్య రంగానికి సంబంధించిన సమస్యలను తమ దృష్టికి వచ్చాయన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అన్యమతాలు మతమార్పిడులకు పాల్పడుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి రేణుకా సింగ్ ఎన్జీఓలు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే మౌళిక సదుపాయాలను కేంద్రమే సమకూరుస్తుందన్నారు. సిబ్బంది నియామకాలకు కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందని స్వామీజీకి చెప్పారు. గిరిజన ప్రాంతాలపై పీఠం చూపుతున్న చొరవను ప్రశంసించారు. మంత్రి రేణుకా సింగ్ ను స్వామీజీ శాలువాతో సత్కరించి శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఆది శంకరాచార్యుల వారి ప్రతిమను బహూకరించారు.
ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలను కలిసిన స్వాత్మానందేంద్ర
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర ఉక్కు, గిరిజన శాఖా మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే, బీజేపీ జాతీయ నేత మురళీధరరావులను ఆయన కలిసారు. ఆదివాసీల కోసం పీఠం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హిందూ ధార్మిక సంస్థలకు స్ఫూర్తినిచ్చే విధంగా విశాఖ శారదాపీఠం కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి ప్రశంసించారు. పీఠం కార్యకలాపాలకు గిరిజన శాఖాపరంగా తమ మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. ఈ ఏడాది పీఠం నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాల కోసం విశాఖ వస్తానని తెలిపారు