ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రజలను సముదాయించే పనిలో ఉన్నారు. తాలిబన్లు కాబుల్ చేరుకున్నాక మూడు రోజుల నుంచి గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎటువేల్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మళ్ళీ పూర్వపు ఆంక్షలు వస్తాయనే భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఈ తరుణంలో తాలిబన్లు ప్రజలకు అభయం ఇచ్చారు. షరియా చట్టం ప్రకారం నడుచుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
తాలిబాన్ల ప్రతినిధి జబిహుల్ల ముజాహిద్ కాబుల్ లో మీడియా సమావేశం నిర్వహించి ప్రజల్లో భయాందోళనలు పోగొట్టే ప్రయత్నం చేశారు. కాబుల్ కైవసం చేసుకున్నాక మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన తాలిబాన్ల ప్రతినిధి వివిధ అంశాలపై స్పష్టత ఇచ్చారు. తొందరలోనే పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, 1990 నాటి ప్రభుత్వానికి ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వానికి తేడా ఉంటుందన్నారు. మహిళలు విద్య, ఉద్యోగాలు చేయటంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, షరియా చట్టం ప్రకారం నడుచుకోవాలని ముజాహిద్ సూచించారు. వైద్య రంగంలో మహిళల అవసరం ఉందన్నారు.
విదేశి బలగాలతో, ఆఫ్ఘన్ మిలిటరీతో కలిసి పనిచేసినవారిని క్షమిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు యధావిధిగా తమ బాధ్యతలు నిర్వహించాలని ముజాహిద్ పిలుపు ఇచ్చ్హారు. ఆఫ్ఘన్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రసారాలు చేసే, వార్తలు సేకరించే మీడియా సంస్థల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విదేశీ రాయబార కార్యాలయాలకు భద్రత కల్పించటం తమ విధి అన్నారు. విదేశీ రాయబార కార్యాలయాలకు, స్వచ్చంద సేవ సంస్థలకు తాలిబాన్ ఫైటర్స్ రక్షణగా ఉన్నారని తెలిపారు. తాలిబాన్ల ముఖ్య నేత అబ్దుల్ ఘని బరదర్ దోహా నుంచి కాబుల్ చేరుకున్నారని ముజాహిద్ వెల్లడించారు.