ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక అన్ని రంగాలపై తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా విద్యావ్యవస్థను నివ్వేరపరిచే నిర్ణయం తీసుకున్నారు. 2000 సంవత్సరం నుంచి 2021 వరకు అందుకున్న విశ్వవిద్యాలయ డిగ్రీలు నిరుపయోగమని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్లు అధికారంలో లేని సమయంలో పొందిన పట్టాలు పనికిరావని విశ్వవిద్యాలయ ఆచార్యులతో జరిగిన సమావేశంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బకి హక్కాని చెప్పారు. ఆధునిక చదువులకన్నా మదర్సాల్లో మతపరమైన విద్యాభ్యాసం చేసిన వారే నిజమైన దేశభక్తులని తాలిబన్లు అంటున్నారు.
విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ డిగ్రీలు, పి.హెచ్.డి లు తీసుకున్న వారి కన్నా మదరసాల నుంచి విద్యాబుద్దులు నేర్చుకున్న వారే ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు తీర్చిదిద్దగలరని ఉన్నత విద్యా శాఖ మంత్రి తేల్చి చెప్పారు. 2000 సంవత్సరం నుంచి 2021 వరకు ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు అమెరికాకు, హమీద్ కర్జాయి, అష్రఫ్ ఘని ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేశారని, వారు దేశ ద్రోహులని తాలిబన్లు ప్రకటించారు.
తాలిబాన్ల నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను ఉద్యోగాలకు, చదువులకు దూరం చేసిన తాలిబన్లు తాజాగా విద్యారంగంపై తీసుకున్నవిధానపరమైన నిర్ణయం అనేక మంది భవిష్యత్తును తారుమారు చేయనుంది. తాలిబాన్ల పాలనలో తమకు భవిష్యత్తు లేదని భావిస్తున్న యువత విదేశాలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.