Wrong timing: ఇంతకుముందు తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదాలుగా అడుగుపెడుతున్నప్పుడు, తెలుగు టైటిల్ తోనే వచ్చేవి. అలాగే స్ట్రయిట్ సినిమాల పోటీ లేకుండా చూసుకుని బరిలోకి దిగేవి. అందువలన ఆ సినిమాలకు ఇక్కడ బాగానే గిట్టుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తమిళ సినిమాలు తమ పేర్లు మార్చుకోకుండానే తెలుగు తెరమీదకి దిగిపోతున్నాయి. ఇక తెలుగులో ఎంత పెద్ద సినిమాలు థియేటర్లకు వస్తున్నా తమ దారి తమదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. తమది పాన్ ఇండియా సినిమా కనుక ఇక చేసేదేమీ లేదంటున్నాయి.
అజిత్ హీరోగా ఇటీవల ‘వలిమై‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ అదే టైటిల్ తో థియేటర్లలో దిగిపోయింది. ‘వలిమై’ అర్థం ఏమిటనేది ఇక్కడి సాధారణ ప్రేక్షకులకు తెలియదు. ఈ సినిమాకి ఇక్కడ పెద్ద పబ్లిసిటీ కూడా లేదు. దాంతో తమిళంలో మూడు రోజుల్లో 100 కోట్లను రాబట్టిన ఈ సినిమాను తెలుగులో పట్టించుకునే వారే కరువయ్యారు. ‘భీమ్లా నాయక్’ కంటే ఒక రోజు ముందుగా ఈ సినిమా థియేటర్లకు రావడమే అందుకు కారణం. ‘భీమ్లా నాయక్’ ధాటికి ‘వలిమై’ తట్టుకోలేకపోయింది .. నిలబడలేకపోయింది.
ఇక ఇప్పుడు సూర్య కూడా అదే పొరపాటు చేస్తున్నాడు. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాకి ఒక రోజు ముందుగా ఈ నెల 10వ తేదీన థియేటర్లకు వస్తున్నాడు. ‘వలిమై’ మాదిరిగానే సూర్య సినిమాకి కూడా తెలుగు టైటిల్ లేదు. ‘ఈటి’ అనే టైటిల్ కి ‘ఎవరికీ తలవంచడు’ అనే ట్యాగ్ లైన్ పెట్టుకుని వస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా కనుక ఒకే టైటిల్ ఉండాలి .. ఒకే రోజున మిగతా భాషల్లోను రిలీజ్ చేయాలనే ఆలోచన వలన ఇలా జరుగుతోంది. హీరో ఎవరైనా .. కథ ఏదైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో టైటిల్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అలాగే విడుదల సమయంపై కూడా దాని విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలను పట్టించుకోకుండా మొక్కుబడిగా రంగంలోకి దిగితే, దాని ఫలితం కూడా అలాగే ఉంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు.
Also Read : సూర్య ‘ఈటీ’ తెలుగు టీజర్ విడుదల