ఒలింపిక్స్ క్రీడాకారులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ ఆఫర్ ప్రకటించారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే వారికి రూ. 3 కోట్లు, సిల్వర్ మెడల్ కు రూ. 2 కోట్లు, బ్రాంజ్ సాధించిన వారికి కోటి రూపాయల చొప్పున బహుమతి అందిస్తామని స్టాలిన్ వెల్లడించారు. జూలై 23 నుంచి జపాన్ లోని టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్టాలిన్ చెప్పారు.
2012లో లండన్ ఒలింపిక్స్ లో చెన్నైకు చెందిన గగన్ నారంగ్ షూటింగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఆ రాష్ట్రం తరఫున విశ్వ క్రీడల్లో పతకం సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా నారంగ్ ఉన్నాడు.
అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించే ఆటగాళ్లకు క్రీడా శాఖలో ఉద్యోగాలు ఇస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గత బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. తద్వారా వారు క్రీడలను మరింత బలోపేతం చేసి భావి క్రీడాకారులకు స్ఫూర్తి ఇస్తారని ఖట్టర్ అభిప్రాయపడ్డారు. 14 క్రీడాంశాల్లో 102 మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించారు. త్వరలోనే వీరు జపాన్ కు పయనమవుతున్నారు. 2012 ఒలింపిక్స్ లో మన అథ్లెట్లు ఆరు పతకాలు సాధించారు. ఇదే మనదేశం తరఫున ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదై ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లోనే తన విధానాలు, కార్యక్రమాలతో విపక్షాలు, విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నారు స్టాలిన్. ఇప్పుడు క్రీడల విషయంలో కూడా ఓ అడుగు ముందుకేసి ఆదర్శంగా నిలిచారు.