మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. చెన్నైలోని ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈడీ ప్రకటించింది. అయితే తమ అదుపులోకి తీసుకుంటుండగా బాలాజీకి ఛాతీ నొప్పి రావడంతో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు తరలించారు. ఆయన ఇంట్లో లభించిన పత్రాలను సీజ్ చేసిన అధికారులు మూడు కార్లలో తమవెంట తీసుకెళ్లారు. కాగా, బాలాజీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికార డీఎంకే ఎంపీ, న్యాయవాది ఇళంగో తెలిపారు.
రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, వైద్యశాఖ మంత్రి సుబ్రమనియణ్, పీడబ్ల్యూడీ మంత్రి ఈవీ వేలు దవాఖానలతో సెంథిల్ బాలాజీని పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. దీనిని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
తమిళనాడు సచివాలయంలో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్‌లోని సెంథిల్ బాలాజీతో చాంబర్‌తోపాటు కొందరి ఇండ్లు, కార్యాలయాలయాలపై దాడులు చేశారు. ఈరోడ్‌లోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లారీ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రిపై ఈడీ ఆరోపిస్తున్నది. గత నెల బాలాజీ సన్నిహితుల ఇండ్లల్లో ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు.