Friday, September 20, 2024
HomeTrending Newsఫ్యామిలీ మ్యాన్ నిషేధించండి  : తమిళనాడు ప్రభుత్వం

ఫ్యామిలీ మ్యాన్ నిషేధించండి  : తమిళనాడు ప్రభుత్వం

ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ షోను ప్రసారంకాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి టి. మనో తంగరాజ్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవ దేకర్ కు లేఖ రాశారు.  మీ విజ్ఞప్తిని పరిశీలిస్తామంటూ కేంద్రమంత్రి ప్రత్యుత్తరం ఇచ్చారు.

మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సిరీస్ మొదటి భాగం అత్యధిక ప్రజాదరణ సంపాదించి ఓటిటిలో మంచి రేటింగ్  సంపాదించింది. దీనికి కొనసాగింపుగా రెండవ భాగాన్ని కూడా రూపొందించారు. అక్కినేని సమంత రెండవ సీజన్ లో ఎల్ టి టి ఈ  సభ్యురాలిగా నటించింది.

ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ లో తమిళ ఈలం తీవ్రవాదులకు ఐ ఎస్ ఐ తో సంబంధాలున్నట్లు అర్ధం వచ్చేలా కొన్ని డైలాగ్ లు ఉన్నాయి.  ఇదే విషయమై ఎండిఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు వైకో కూడా నిన్ననే కేంద్రానికి లేఖ రాశారు. తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

కాగా, ఈ సీరీస్ దర్శకులు రాజ్ – డీకే లు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఫ్యామిలీ మ్యాన్-2 లో తమిళ మనోభావాలు కించపరిచే విధంగా ఎలాంటి సన్నివేశాలు లేవని… తమిళులపై తమకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. సిరీస్ విడుదలయ్యేంత వరకూ ఆగాలని కోరారు.

ఈ సిరీస్ తయారు చేయడం వెనుక సంవత్సరాల కృషి ఉందని, ఎవరినీ నొప్పించకుండా, తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందని వివరించారు. సిరీస్ విడుదలైన తరువాత అందరూ అభినందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పైగా, ఈ సీరీస్ కోసం  తమిళనాడుకు చెందినా ఎంతోమంది సాంకేతిక నిపుణులు, కవులు పనిచేశారని ప్రకటనలో పేర్కొన్నారు.

అమెజాన్ ప్రైమ్ లో జూన్ 4 న ఈ సిరీస్ విడుదల చేయాలని నిర్ణయించారు. గత ఏడాది లోనే విడదల చేయాలని నిర్ణయించినప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్