Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. ఇందుకోసమే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసులతో దాడులు పాల్పడుతుంది అని మండిపడ్డారు. వివాదాల ముసుగులో 8 ఏళ్ల తప్పిదాలను తప్పిచుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

“ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ వైఖరి హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల మాటలు విని సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకసారి అమ్ముడుపోయిన వాళ్లు మరోసారి అమ్ముడుపోలేరా? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లింది? స్టే కోసం ఎందుకు ప్రయత్నించింది? బీజేపీలోకి రావాలని అడిగారని ఎమ్మెల్సీ కవిత ఈ రోజు పత్రికా సమావేశంలో అంగీకరించారు. ఈ ఘటనలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసుకోవాలి. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలి. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విచారణను కేవలం నలుగురు ఎమ్మెల్యేలకే పరిమితం చేస్తే కోర్టు ముందు సిట్ కూడా దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు.

కేంద్రంలోని ఈడీ, సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ఎవ్వరూ కూడా స్వేచ్చగా నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. 2004-14 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు వ్యాపారులను, వ్యాపార సంస్థలను వేధించలేదు. పార్టీలు మారిన నేతలను కూడా వేధించలేదు. ఈరోజు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తమకు నచ్చిని వారిని తుదముట్టించే విధంగా పరిస్థితులు కల్పిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పక్కదోవ పడుతున్నాయి అని వ్యాఖ్యానించారు. కీలకమైన రైతు రుణమాఫీ, వడ్ల కొనుగోలు, పోడు భూములు, డబుల్ బెడ్రూమ్, ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి, మల్లన్న సాగర్, మిడ్ మానేరు ముంపు బాధితులు, డిండి ప్రాజెక్టు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి వాటిపై చర్చ జరగడం లేదని అవేదన వ్యక్తం చేశారు. కేవలం ఈడీ, సీబీఐ, ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసుల దాడులు, పార్టీ ఫిరాయింపులు, ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు వంటి అనవసర అంశాల చూట్టూ చర్చ జరుగుతుంది. అందుకే ప్రజా సమస్యలపై కొట్లాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రేపు జూమ్ మీటింగ్ ద్వారా నాయకులందరితో చర్చించి త్వరలోనే కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటిస్తాం. ముందుగా రైతు సమస్యలపై పోరాటం చేయాలనుకుంటున్నాం. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో బలహీన వర్గాల పక్షాన..బీసీ జనాభా లెక్కలు, వారికి దక్కాల్సిన నిధులు తదితర సమావేశాలపై పోరాటం చేస్తామన్నారు.
కవితను పార్టీలోకి రావాలని బీజేపీ ఆహ్వానించిందే తప్ప..కాంగ్రెస్ కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని లేవనెత్తిన ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పాలి. విమర్శలకు విమర్శలతోనే సమాధానం చెప్పాలి. అంతేకానీ ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు కాబట్టే టీఆర్ఎస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి దాడులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దాడులు ఎవరూ చేసినా తప్పే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : అరవింద్ జాగ్రత్త…చౌరస్తాలో చెప్పుతో కొడతా – కవిత వార్నింగ్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com