తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తెలంగాణపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు.. తాజాగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వచ్చే ఏడాది తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉండటంతో.. ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచుతుండగా.. ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్ష పార్టీలు, నేతలు నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ సీన్ లోకి చంద్రబాబు రీఎంట్రీ ఇస్తున్నారు. గతంలో వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఏలూరు, అల్లూరి జిల్లాలో మీదుగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు భద్రాచలంలో బస చేశారు. భద్రాచలం రామయ్యను దర్శించుకుని, అనంతరం గోదావరి ముంపు ప్రాంతాల్లో తిరిగారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందనే ఆలోచనతో పార్టీకి నూతన ఉత్తేజం తీసుకు వచ్చేందుకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చంద్రబాబు గత పర్యటనలో ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో టీటీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో 5లక్షల మందితో భారీ బహరింగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీపీ నేతలు వెల్లడించారు. భారీ బహిరంగ సభకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.