ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీ హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. వైయస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలని కోరారు.
ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ, బెదిరిస్తూ, దాడులకు దిగుతున్నారని, అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతలు హల్ చల్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీకి దక్కుతుందని విమర్శించారు.
పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసికి తెలియజేశామన్నారు. ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్నికూడా చెప్పమన్నారు. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే తగిన చర్యలు తీసుఎకోవాలని విజ్ఞప్తి చేశారు.