ఆసియ కప్ టోర్నమెంట్ కోసం దుబాయ్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ను బిసిసిఐ విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు నబీ, రషీద్ ఖాన్ భారత ఆటగాళ్ళతో కరచాలనం చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలతో పాటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కరచాలనం చేస్తూ అతన్ని భుజంపై తట్టి అభినందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివర్లో తాత్కాలిక హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్ ఆటగాళ్లకు ఏదో సలహాలిస్తున్న దృశ్యం కూడా కనబడింది.
ఎల్లుండి ఆగస్ట్ 27నుంచి సెప్టెంబర్ 11వరకూ ఆసియ కప్ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగనుంది. తొలుత ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉండగా అక్కడ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వేదికను దుబాయ్ కు మార్చారు. గ్రూప్ ‘ఏ’లో ఇండియా, పాకిస్తాన్, హాంగ్ కాంగ్… ‘బి’లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్ శ్రీలంక- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎల్లుండి జరగనుంది. ఆదివారం ఇండియా-పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
Also Read : VVS Laxman: తాత్కాలిక హెడ్ కోచ్