బిజెపి, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ వైరానికి పశ్చిమ బెంగాల్ మరోసారి వేదికైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం.. విభేదాలు మరోసారి బయట పడ్డాయి. సందేశ్‌ఖలిలో ఈడి ఆదికారులపై దాడులు మరువకముందే తాజాగా NIA బృందంపై అల్లరి మూకలు దాడులకు తెగపడ్డాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ రోజు (శనివారం) జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై దాడి జరిగింది. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్ లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేసేందుకు వెళ్ళింది. స్థానికులు ఎన్‌ఐఏ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్‌ఐఏ అధికారులను చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేసి.. జనం అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. దాడిలో ఇద్దరు అధికారులు గాయపడగా.. వాహనం అద్దాలు ధ్వంసమైయ్యాయి.
భూపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్యబిలా గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంటి వద్ద డిసెంబర్ 2022లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు 2023 జూన్‌లో దర్యాప్తు ప్రారంభించైనా ఎన్‌ఐఏ అధికారులు విచారణలో భాగంగా ఇవాళ భూపతినగర్‌కు వెళ్లారు.
గత నెలలో ఎన్ఐఏ 8 మంది టీఎంసీ నేతలను విచారణకు పిలిచింది. మార్చి 28న న్యూ టౌన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి అందరినీ రావాలని తెలిపింది. ఇదే కేసులో టీఎంసీ నేత మంబేంద్ర జానాతో పాటు మరొకరిని అరెస్ట్ చేసేందుకు ఎన్ఐఏ బృందం వెళ్ళగా.. గ్రామస్థుల నుంచి ఎన్ఐఏ నిరసనలు ఎదుర్కొంది. నిందితులను తప్పించేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్ఐఏ అధికారుల కార్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
రెండు నెలల క్రితం (జనవరి 5వ తేదిన) రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులపై విచక్షణారహితంగా దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఇదే కేసులో అరెస్టయిన రాష్ట్ర మంత్రికి సన్నిహితుడైన షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఈడి అధికారులపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. అధికారులను విచక్షణారహితంగా కొట్టడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగలు తీశారు. అధికారులకు రక్షణగా వచ్చిన సిఆర్‌పిఎఫ్ బలగాలకు చెందిన వాహనాలను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తమకన్నా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ఉండడంతో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది సైతం నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది.
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అబ్ధిదారులకు అందచేసే రేషన్‌లో 30 శాతం బహిరంగ మార్కెట్‌కు మళ్లించారని, దాని ద్వారా వచ్చిన సొమ్మును రేషన్ డీలర్లు, మిల్లర్లు పంచుకున్నారని ఈడి గతంలో ఆరోపించింది. కోట్లాది రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ను ఈడి ఇదివరకే అరెస్టు చేసింది.
లోక్ సభ ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు రాజకీయ ప్రేరేపితమని TMC ఆరోపిస్తుండగా… తమకు సంబంధం లేదని బిజెపి కొట్టిపారేస్తోంది.
-దేశవేని భాస్కర్