తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఈ రోజు (శుక్రవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జిట్టా రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
జిట్టా బాలకృష్ణా రెడ్డి సామాజిక సేవతో పేరు పొందారు. ఫ్లోరైడ్ బాధితులను ఆదుకునేందుకు భువనగిరి సమీపంలోని గ్రామాలలో మంచినీటి కోసం వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయి. భువనగిరి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక భువనగిరి కోటకు లైటింగ్ వేయించి వెలుగులు నింపారు. పోచంపల్లి పరిసరాల్లో మూసి నది కాలుష్యంపై పోరాటం చేసి ప్రజల మన్ననలు పొందారు.
తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక నల్గొండ జిల్లాలో యువతను ఉద్యమం వైపు మళ్లించటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ జాతర పేరుతో స్థానిక వంటకాలతో కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ సంబురాల పేరుతో నిజాం కాలేజీలో టీఆర్ఎస్ అధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ క్రీడలను పరిచయం చేసేందుకు వివిధ సందర్భాల్లో క్రీడలు నిర్వహించారు. వీటన్నింటికి సొంత నిధులు నిర్వహించిన ఘనత జిట్టాకే చెల్లింది.
జిట్టా బాలకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని అభిమానుల పాదయాత్ర
బీఆర్ఎస్ ఆవిర్భావించాక పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ దక్కక.. పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ హఠాన్మరణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. లోక్‌సభలో వైఎస్ జగన్ ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేక విధానం ప్రకటించటంతో సొంతంగా యువ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు.
యువ తెలంగాణ పార్టీని కమలం పెద్దల సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుని మార్పు జరిగాక జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నెల రోజులు కూడా గడువక ముందే గతేడాది అక్టోబర్ 20న బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో 14 ఏండ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఎన్నికల్లో జిట్టాకు బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం జరిగినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలన్న జిట్టా కల నెరవేరలేదు. ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం… తదుపరి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు పోరాటం.. ఆ తర్వాత అనారోగ్యంతో పోరాటం. మొదటిది సాపల్యం అయినా చివరి రెండు జిట్టా జయించలేకపోయారు.
జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతి వార్తా తెలియగానే ఆయన అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఉద్యమకారులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
-దేశవేని భాస్కర్