Friday, July 5, 2024
HomeTrending Newsతెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. బిసి నేతల ఆశలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. బిసి నేతల ఆశలు

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు రావటంతో ఆశావాహ బిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదైన శైలిలో ఆమాత్య పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వస్తున్న పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చెపుతున్న మాటలు, హామీలు… కార్యచరణలో కనబరచటం లేదనే అపవాదు ఉంది.

కెసిఆర్ మంత్రివర్గంలో బిసిలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. అదే రీతిలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోను నామమాత్రపు మంత్రి పదవులు కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దాదాపు 80 శాతానికి పైనే ఉన్నా.. పెత్తనం అగ్రవర్ణాలదే. జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వంలో న్యాయమైన ప్రాతినిధ్యం దక్కడం లేదని బలహీనవర్గాలు వాపోతున్నాయి. బడుగు, బలహీన వర్గాల పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ లో ఓ కులం వారిదే పెత్తనమని విమర్శలున్నాయి.

మంత్రిమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి సహా 12 మంది ఉండగా, వారిలో ఏడుగురు ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. బలహీనవర్గాల వారు ఐదుగురు ఉన్నారు. ఏడుగురు ఓసీలలో నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా, మిగతా ముగ్గురిలో ఒకరు బ్రాహ్మణ, ఒకరు కమ్మ, మరొకరు వెలమ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. మిగతా ఐదుగురిలో ఇద్దరు ఎస్సీలు (భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ), ఇద్దరు బీసీలు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌), ఎస్టీ (సీతక్క) ఉన్నారు.

రాబోయే విస్తరణలో నలుగురికి చోటు కల్పించనుండగా వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం, ఇద్దరు బీసీలకు అవకాశం ఉంటుందని తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి పీ సుదర్శన్‌రెడ్డికి చోటు కల్పించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

బీసీలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లభించలేదనే విమర్శలను అధిగమించేందుకు ఆ సామాజికవర్గానికి పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అధికారమంతా సీఎం చేతిలోనే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు మరో పవర్‌ సెంటర్‌ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తికే ఈ పదవి కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షులుగా కొత్త వారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లెక్కన ప్రస్తుత నలుగురు ‘రెడ్డి’ మంత్రుల సంఖ్య ఆరుకు చేరుకోనుండగా, ఓసీ మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరుకోనుంది. మరో ఇద్దరు బీసీలు.. వాకిటి శ్రీహరి (మక్తల్‌), దానం నాగేందర్‌ (హైదరాబాద్‌)కు మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం.

ఈ దఫా బిసిలకు అమాత్య పదవులతో పాటు ప్రాధాన్యమున్న శాఖలు కేటాయించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే అంశం విపక్షాలకు అస్త్రం కానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్